కరోనా పరిస్థితులతో చోటుచేసుకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇంటర్ బోర్డు పలు కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది నుంచి అర్ధ సంవత్సరం పరీక్షలు లేదా ఇంటర్నల్స్ నిర్వహించాలని భావిస్తోంది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు గతేడాది కరోనా తీవ్రత కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. ఆ విద్యార్థులకు పదో తరగతిలోనూ పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు లేదా సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆలోచిస్తోంది. ఒకవేళ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే.. వారికి మార్కులు ఏ ప్రాతిపదికన వేయాలో అంతుచిక్కడం లేదు.
ఒకవేళ రెండో సంవత్సరం కూడా వార్షిక పరీక్షలు నిర్వహించలేకపోతే.. ఇంటర్ సర్టిఫికెట్ ఎలా ఇవ్వాలనే అంశంపై అంతర్గత చర్చోపచర్చలు జరిగాయి. అర్ధ సంవత్సరం పరీక్షలు నిర్వహించడం మేలనే అభిప్రాయానికి వచ్చారు. ఒకవేళ వార్షిక పరీక్షలు నిర్వహించలేకపోతే.. అర్ధ సంవత్సరం పరీక్షల్లో మార్కుల ఆధారంగానైనా ఉత్తీర్ణులను చేయవచ్చునని ఆలోచన.