Biometric Attendance in Junior Colleges: గృహ, వాణిజ్య మిశ్రమ సముదాయాల్లో నడుస్తున్న జూనియర్ కాలేజీలకు రెండేళ్ల పాటు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం మినహాయింపునివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు హోంశాఖ మంత్రిని కోరనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మిశ్రమ సముదాయాల్లోని జూనియర్ కాలేజీలకు అగ్నిమాపక ఎన్ఓసీ ఉంటే ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపునిస్తుంది. సుమారు 340 కాలేజీలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ లేనందున అనుబంధ గుర్తింపును ఇంటర్ బోర్డు పెండింగులో పెట్టింది. అయితే ఆ కళాశాలల్లో వేల మంది విద్యార్థులు చేరి తరగతులకు హాజరవుతున్నారు. ఆ విద్యార్థులను ప్రైవేట్‌గా పరీక్షలు రాయించాలని భావించినప్పటికీ.. గందరగోళానికి దారితీస్తుందని భావించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్ఓసీ మినహాయింపునివ్వాలని నిర్ణయించారు.
ఇక నుంచి బయోమెట్రిక్ హాజరు: నాంపల్లిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఇంటర్మీడియట్ విద్యా మండలి సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ లో సిలబస్ మార్పులు చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.