Hizb ut Tahrir case In Hyderabad : హిజ్బ్ ఉత్ తహ్రీర్ కేసులో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ , తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పరారీలో ఉన్న సల్మాన్ జాడ ఇంకా తెలియరాలేదు. హైదరాబాద్‌లో దాడులు చేసేందుకు సలీం, సల్మాన్ కీలకంగా వ్యవహరించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ ఇద్దరు నిందితులు మెహిదీపట్నంలోని పిస్టల్ షూటింగ్ సెంటర్లో వారం పాటు శిక్షణ తీసుకున్నట్లు గుర్తించారు.
సెంటర్ నిర్వాహకులు ఆధార్, ఇతర చిరునామా వివరాలు అడగడంతో అక్కడ శిక్షణ మానేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఆత్మరక్షణ పేరుతో ముస్లిం యువతకు దేహ దారుఢ్యంపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. దీని ద్వారా యువతను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారని విచారణలో తేలింది. ఓయూలోని ఓ మైదానంతో పాటు శామీర్ పేట్ లోని నిర్మానుష్య ప్రాంతాల్లోనూ యువతకు శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న సల్మాన్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు దృష్టి పెట్టారు. గత 10 రోజులుగా సల్మాన్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు నిఘా అధికారులు గుర్తించారు.
ఈ కేసులో ఇప్పటివరకు 17మంది అరెస్ట్ : అయితే ఇప్పటికే హిజ్బ్ ఉత్ తహ్రీర్ కేసు (ఇస్లామిక్ రాడికల్స్)లో మే 10వ తేదీన భోపాల్‌కు చెందిన 12 మందిని, హైదరాబాద్‌కు చెందిన ఐదుగురిని నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ నిందితులు అందరూ ఏడాదిన్నర కాలం నుంచి ఇస్లామిక్ రాడికల్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు ఇంటెలిజెన్స్ బృందం గుర్తించింది. ప్రముఖ ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉద్ తహ్రీర్‌తో నిందితులకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
హిజ్బ్ ఉత్ తహ్రీర్ కేసు నేపథ్యం :దేశంలో పెను విధ్వంసం సృష్టించడానికి మూడంచెల విధానాలను అనుసరిస్తూ ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్రణాళికలు రచించారు. ఇందులో తొలి దశలో యువతను ఆకర్షించి తమవైపు తిప్పుకుంటారు. రెండో దశలో వారికి సాంకేతిక, ఇతర అంశాల్లో శిక్షణ ఇస్తూ.. మూడో దశలో దాడి ఎలా చేయాలో ప్రణాళికలు రచించడం. ఇవే హిజ్బ్ ఉత్ తహ్రీర్ ఉగ్రవాద సంస్థ ఈ ఇస్లామిక్ రాడికల్స్ ప్లాన్ . ఈ శిక్షణలో భాగంలో వీరికి వికారాబాద్ అనంతగిరి దట్టమైన కొండల మధ్య శిక్షణ ఇస్తారు. వీరి ప్రధాన కర్తవ్యం హైదరాబాద్‌లో పెను విధ్వంసమే. యువతను వారివైపు వేగంగా ఆకర్షించడానికి యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించారు.
ఇవీ చదవండి :