మనకి ఆరోగ్య బీమా ఉంది.. చేతిలో డబ్బు లేకపోయినా చికిత్సకు డోకా లేదన్న దీమాతో ఉన్నారా? అవేవీ ఇక్కడ పనిచేయవంటున్నాయి కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు. డబ్బు కడితేనే పడక ఇస్తామని చెబుతున్నాయి. కరోనా సోకి పరిస్థితి ఎంత విషమంగా ఉన్నా ముందుగా సొమ్ము చెల్లిస్తేనే చేర్చుకుంటున్నాయి. వివిధ ఛార్జీల మోత మోగిస్తున్నాయి. పడక కావాలంటే ముందే కనీసం రూ.లక్ష డిపాజిట్ కట్టాలని చెబుతున్నాయి. ఆరోగ్య బీమా ఉందని చెప్పినా వినడంలేదు. నాయకులు, ఉన్నతాధికారులతో సిఫారసులు చేయించుకుంటే తప్పదన్నట్లు అంగీకరిస్తున్నాయి. వేరే దారి లేక కొందరు డబ్బు చెల్లించి చేరుతున్నారు. లేనివారు ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.
లక్షల్లో బిల్లులు
కొవిడ్ చికిత్సల్లో పలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం చెప్పిన నిర్ణీత ఛార్జీలు అమలు కావడంలేదు. జ్వరం, ఆయాసం వంటి లక్షణాలుంటే చాలు రెండు, మూడు రోజులకే రూ.లక్ష బిల్లు దాటుతోంది. ఐసీయూ, వెంటిలేటర్ పేరిట వడ్డించేస్తున్నారని పలువురి ఆరోపణ. గ్రేటర్‌లో రోజూ 800-900 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొందరిలో ఏ లక్షణాలు కనిపించకపోయినా ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. బాధితుల సంఖ్యతో పోల్చితే పడకలు చాలక డిమాండ్ పెరుగుతోంది. ఇదే నిర్వాహకులకు కాసులు కురిపిస్తోంది.