పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ప్యానల్ బోర్డులున్నచోట ఆధునిక పరికరాలను ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ప్రతి విద్యుత్కేంద్రంలో భద్రతా విభాగానికి ప్రత్యేకంగా ఉప కార్వనిర్వాహక ఇంజినీరు (డీఈ), సహాయ ఇంజినీరు (ఏఈ), ఇతర సిబ్బంది ఉంటారు. వీరు 24 గంటలూ (నిరంతరం) ప్రతి విభాగాన్ని తనిఖీ చేస్తుండాలి. ఎక్కడైనా షార్ట్‌సర్క్యూట్‌తో గాని, ఇతర కారణాలతో గాని మంటలు వచ్చే అవకాశముందా, తీగలు సరిగా ఉన్నాయా, బ్యాటరీల ఛార్జింగ్ సరిగా ఉందా తదితర అన్ని విషయాలు పక్కాగా పరీక్షిస్తుండాలి. ‘శ్రీశైలం’లోనూ ఈ వ్యవస్థ ఉంది. అయితే తాజా ప్రమాదంతో ఇతర విద్యుత్కేంద్రాల్లో తనిఖీలు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పరిశీలించాలని ఆయా కేంద్రాల అధిపతులైన చీఫ్ ఇంజినీర్ల(సీఈ)లను జెన్‌కో ఆదేశించింది.
అధిక వేడి, ఉష్ణోగ్రతలుండే బాయిలర్లతో నడిచే బొగ్గు ఆధారిత థర్మల్కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణంగా సీఈ ఎక్కువగా పాలనా వ్యవహారాలు చూస్తుంటారు. వారానికోమారు ప్రతి థర్మల్కేంద్రంలో మాక్‌డ్రిల్ నిర్వహిస్తారు. ఎక్కడైనా ఒకచోట చిన్న అగ్నిప్రమాదం సృష్టించి అలారం మోగిస్తారు. అన్ని విభాగాల సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పడానికి చర్యలు తీసుకోవాలి. శ్రీశైలం ప్రమాదంతో ప్రతి కేంద్రంలో సీఈనే నేరుగా అన్ని విభాగాలకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారని కొత్తగూడెం థర్మల్ కేంద్రంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ‘ఈనాడు’కు తెలిపారు. శ్రీశైలంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రమాదం జరిగే ఆస్కారం ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు.