సినీ దర్శకుడు శంకర్‌కు ప్రభుత్వం కేటాయించిన భూమిపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం వ్యాజ్యంపై విచారించింది. కోట్లాది రూపాయల విలువైన భూమిని లక్షల రూపాయలకే ఏ ప్రాతిపదికన ఇచ్చారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. విలువైన భూముల్ని పల్లెల్లాగా పంచేస్తారా అని ఘాటుగా విమర్శించింది.
సవాల్ చేసిన నిరుద్యోగి
రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లిలో శంకర్‌కు 5 ఎకరాల భూమిని, 5 లక్షలకు ఎకరం చొప్పున ప్రభుత్వం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ నిరుద్యోగి శంకర్ పిల్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ప్రభుత్వం కేటాయించిన భూమిలో రూ.50 కోట్ల రూపాయల వ్యయంతో స్టూడియో నిర్మించనున్నట్లు దర్శకుడు శంకర్ నివేదించారు. ఫలితంగా సుమారు 300 మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు. స్టూడియో నిర్మాణం ప్రస్తుతం ఏ దశలో ఉందని హైకోర్టు ప్రశ్నించగా... ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసి భూమిని చదును చేసినట్లు శంకర్ తరఫు న్యాయవాది వివరించారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. శంకర్‌కు కేటాయించిన భూమి, మార్కెట్ ధర ప్రకారం ఎకరానికి రెండున్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని కౌంటర్లో హెచ్ఎండీఏ పేర్కొంది.