'ఎర్రమంజిల్ భవనాలు వారసత్వ సంపద కాదు' - buildings
ఎర్రమంజిల్ భవనాల విషయంలో చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ భవనాలను కూల్చివేయవద్దంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.
నూతన సచివాలయం కోసం ఎర్రమంజిల్ భవనాలు అక్రమంగా కూల్చివేస్తున్నారన్న పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. భారత రాజ్యాంగంలో వారసత్వ సంపద ప్రస్తావనే లేదని అదనపు ఏజీ వాదించారు. ఎర్రమంజిల్ భవనాలను వారసత్వ కట్టడాల పరిరక్షణ జాబితా నుంచి చట్ట ప్రకారమే తొలగించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర జాబితాలోని చారిత్రక కట్టడాల జాబితాను కొనసాగిస్తూ.. హుడా చట్టంలోని కట్టడాలను ఎందుకు తొలగించారని హైకోర్టు ప్రశ్నించింది. పట్టణ ప్రాంతాల చట్టానికి అనుగుణంగా జాబితా లేనందునే తొలగించినట్లు అదనపు ఏజీ పేర్కొన్నారు. కొత్త జాబితా రూపొందిస్తామని.. చారిత్రక కట్టడాల పరిరక్షణలో ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకుంటుందని అదనపు ఏజీ పేర్కొన్నారు.