రద్దయిన ఆర్వోఆర్ చట్టం కింద సాదా బైనామాలను ఎలా క్రమబద్ధీకరిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ జీవో చట్ట బద్ధత ఏమిటో తెలపాలని స్పష్టం చేసింది.
'ఆ చట్టంలో లేనప్పుడు సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఎలా చేస్తారు?' - Sorting of plain names latest news
సాదా బైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. రద్దయిన ఆర్వోఆర్ చట్టం కింద దరఖాస్తులు ఎలా స్వీకరిస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టంలో లేనప్పుడు సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఎలా చేస్తారని పేర్కొంది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలపాలని ఆదేశించింది.
కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక పాత ఆర్వోఆర్ చట్టం రద్దయిందని.. కానీ ఆ చట్టం ఆధారంగా రిజిస్ట్రేషన్ లేని భూములను క్రమబద్ధీకరిస్తున్నారంటూ నిర్మల్ జిల్లాకు చెందిన రైతు షిండే దేవిదాస్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నేటితో గడువు ముగియనుందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలపడంతో.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మధ్యాహ్నం అత్యవసర విచారణ చేపట్టింది.
పేద, మధ్య తరగతి రైతుల ప్రయోజనాల కోసం అక్టోబరులో జీవో జారీ చేసినట్లు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. అక్టోబరు 29న కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చినందున.. ఆ తర్వాత స్వీకరించిన దరఖాస్తులను ఎలా క్రమబద్ధీకరిస్తారని ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి... ఎన్ని పరిష్కరించారు.. ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి.. తదితర పూర్తి వివరాలను తెలపాలని ఆదేశిస్తూ విచారణ రేపటికి వాయిదా వేసింది.