Innovation Leadership Award for Rajasekhar Buggavitti: క్రియేటివ్ మల్టీమీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు, రాజశేఖర్ బుగ్గవీటికి ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఈ నెల 17వ తేదీన ముంబయిలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్లో నిర్వహించిన వరల్డ్ ఇన్నోవేషన్ కాంగ్రెస్ అండ్ అవార్డ్స్-2023 వేడుకల్లో రాజశేఖర్ బుగ్గవీటిని ఇన్నోవేషన్ లీడర్షిప్ అవార్డ్‌తో సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాజశేఖర్ కీలక ఉపన్యాసం చేశారు. తన జీవితంలో నెలకొన్న 25 సంవత్సరాల అనుభవాల్ని, తాను సముపార్జించిన విజ్ఞానాన్ని ఆహూతులతో పంచుకున్నారు. 'డిజైన్ థింకింగ్ ఫర్ ఇన్నోవేషన్' అనే అంశంపై ఆయన వర్ణనాత్మకంగా, సోదాహరణంగా చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. తమ సంస్థ క్రియేటివ్ మల్టీమీడియా రూపొందించిన లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ డిజైన్ ద్వారా సాధించిన విజయాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
"క్రియేటివ్ మల్టీమీడియా గ్రూప్ స్థాపించినప్పటి నుంచి కొత్త ఆవిష్కరణలే మైలురాయిగా ముందుకు సాగుతున్నాం. సృజనాత్మకమైన పోటీలో మమ్మల్ని అగ్రగామిగా నిలుపుతున్నది ఈ ఆవిష్కరణలే. క్రియేటివ్ మల్టీమీడియాలో మేం ఇచ్చే శిక్షణలో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారిస్తాం. ప్రపంచస్థాయి మల్టీమీడియా ప్రతిభావంతులను తయారుచేయగలగడంతోపాటు సంస్థ ఎదుగుదలకూ అది ఎంతో దోహదపడుతోంది. ఇది కేవలం మాకు మాత్రమే కాదు మా దగ్గర శిక్షణ పొందిన ప్రతిభావంతులను నియమించుకునే సంస్థల పురోగతికి కూడా ఎంతో సహకరిస్తోంది"- రాజశేఖర్ బుగ్గవీటి, క్రియేటివ్ మల్టీమీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు
ఆవిష్కరణలను ప్రోత్సహించడమే కాదు వాటిని ఆయా సంస్థల విలువలకు ప్రతీకలుగా నిలిపే ప్రయత్నాలను గుర్తించి, వెలుగులోకి తేవడమే లక్ష్యంగా డబ్ల్యూఐసీఏ పని చేస్తోంది. సృజనాత్మక ఆవిష్కరణల రంగాల్లో విశేష కృషి చేసినవారిని, తమ ఆవిష్కరణలతో ప్రపంచంపై మెరుగైన ప్రభావం చూపినవారిని గుర్తించి అవార్డులను ఇచ్చి సత్కరిస్తోంది. నాయకులు, పరిశోధకులు, విద్యావేత్తలతో కూడిన ఓ స్వతంత్ర కమిటీ.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన ఇలాంటి వినూత్న ఆవిష్కర్తల జాబితాలో నుంచి పురస్కారాలకు ఏటా కొద్ది మందిని ఎంపిక చేస్తోంది. ఆ జాబితాలో ఈ ఏడాది రాజశేఖర్ బుగ్గవీటి స్థానం దక్కించుకున్నారు. క్రియేటివ్ మల్టీమీడియా గ్రూప్ ద్వారా ఆయన మల్టీమీడియా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో డిజిటల్ మీడియా, ఇతర రంగాల ప్రముఖులు హాజరై రాజశేఖర్ బుగ్గవీటిని అభినందించారు.