తెలంగాణ

telangana

ETV Bharat / state

Inhuman Incident in Langerhouse : బతికున్నప్పుడు వేధించాడని.. చనిపోయాక మూడు ముక్కలుగా.. - వేధించాడని చనిపోయాకా సోదరుడి మృతదేహాన్ని ముక్కలు

Inhuman Incident in Langerhouse : బతికున్నంత కాలం తమను వేధించాడని సొంత సోదరుడిపై కక్ష పెంచుకున్న తోడబుట్టినవారు.. అంత్యక్రియలకు డబ్బులేదనే సాకుతో చనిపోయిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి గోనెసంచిలో కట్టి పడేశారు. మానవత్వం ముక్కలైందా అనిపించే ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో మరికొన్ని విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి.

Inhuman Incident
Inhuman Incident

By

Published : May 13, 2023, 11:46 AM IST

Inhuman Incident in Langerhouse : బతికున్నంత కాలం తమను వేధించాడని సొంత సోదరుడిపై కక్ష పెంచుకున్న తోడబుట్టినవారు.. అతను చనిపోయాక ప్రతీకారం తీర్చుకున్నారు. అంత్యక్రియలకు డబ్బులు లేవనే కోపంలో మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికేశారు. అనంతరం పుట్​పాత్​ మీద విసిరేశారు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఎఫ్‌సీఎల్‌ కాలనీకి చెందిన బాలరాజ్‌, బాలమ్మ(85)కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తపాలా ఉద్యోగైన బాల్‌రాజ్‌ గతంలోనే మరణించారు. పెద్ద కుమారుడు, పెద్ద కుమార్తె పెళ్లిళ్లు చేశారు. వీరిద్దరూ నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇద్దరు కుమారులు అశోక్‌(50), రాజు(45), చిన్న కుమార్తె స్వరూప(35)తో కలిసి బాలమ్మ ఎన్‌ఎఫ్‌సీఎల్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆమెకు వచ్చే పింఛనుతోనే వీరందరి అవసరాలు తీరుతున్నాయి. ఏ పనీ చేయని అశోక్‌ మద్యానికి బానిసయ్యాడు. తల్లికి వచ్చే పింఛన్‌ డబ్బుల కోసం వేధించేవాడని పోలీసుల విచారణలో తేలింది.

రెండు రోజులు ఇంట్లోనే సోదరుడి మృతదేహం:రాజు, స్వరూప అప్పుడప్పుడు కూలీ పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల అశోక్‌ ఆరోగ్యం క్షీణించగా ఆస్పత్రిలో చూపించారు. పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకొచ్చారు. దాంతో ఆయన ఈ నెల 9న చనిపోయాడు. అశోక్ చనిపోయిన విషయాన్ని రాజు, స్వరూపలు ఇరుగుపొరుగుకు తెలియనివ్వలేదు. రెండ్రోజులు ఇంట్లోనే మృతదేహాన్ని పెట్టి పాత విషయాలన్నీ గుర్తు చేసుకుని రగిలిపోయారు. మద్యం కోసం తమ దగ్గరున్న పైసలనూ లాక్కున్నాడని, ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేదని వాపోయారు. చుట్టుపక్కల వారి సాయం తీసుకుందామని తల్లి బాలమ్మ చెప్పినా పట్టించుకోలేదు. కూరగాయలు కోసే కత్తితో అశోక్‌ మృతదేహాన్ని మూడు ముక్కలు చేశారు. తల, కాళ్లు, మొండెం రెండు ప్లాస్టిక్‌ సంచుల్లో మూటగట్టారు. గురువారం రాత్రి ఆటోలో లంగర్‌హౌస్‌కు వచ్చారు.

కిరాయి డబ్బులు లేవని చెప్పడంతో దింపేసిన డ్రైవర్:ఆటో డ్రైవరుకు కిరాయి డబ్బులు లేవని చెప్పడంతో అతను మిలటరీ ఆస్పత్రి ఎదురుగా రాజు, స్వరూపలను దింపేశాడు. దాంతో అక్కడికి సమీపంలోని ఫుట్‌పాత్‌పై సంచుల్ని పెట్టి వెళ్లిపోతున్న నిందితులను అక్కడ ఉన్న ఓ వ్యక్తి గమనించారు. సంచుల్లో చూడగా ఒకదాంట్లో తల కనిపించింది. అప్రమత్తమైన అతను.. మరో ఇద్దరి సాయంతో రాజు, స్వరూపను పట్టుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని, సంచులను తెరిచి చూశారు. నిందితులు తొలుత పొంతనలేని సమాధానాలు చెప్పడంతో గట్టిగా నిలదీయగా.. మృతదేహం తమ సోదరుడిదని చెప్పారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న రాజు పోలీసుల ముందే రక్తపు వాంతులు చేసుకున్నాడు. చనిపోయిన అశోక్‌తో పాటు రాజు, స్వరూప మానసికంగా బాధపడుతుండే వారని స్థానికులు తెలిపారు. పోలీసులు శుక్రవారం ఉదయం మంగళ్‌హాట్‌లో ఉంటున్న పెద్ద కుమారుడు విజయ్‌ను పిలిపించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. శనివారం శవపరీక్ష తర్వాత అశోక్‌ మృతదేహాన్ని ఆయనకు అప్పగిస్తామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details