తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌ బాధితుల ఆచూకీ తెలియడం లేదా?!

ఆసుపత్రుల్లో చేరిన కరోనా బాధితుల క్షేమ సమాచారం తెలుసుకోవడం కుటుంబ సభ్యులకు ప్రయాసగా మారింది. చనిపోయినా రెండు మూడు రోజులకు కానీ.. సమాచారం తెలియడంలేదు. రిజిస్టర్‌లోని సమాచారం తప్పు అయినా.. ఫోన్‌ నంబరు పనిచేయక పోయినా.. ఇబ్బందే. ఒక్కోసారి ఆఖరి చూపునకు అవస్థలు తప్పడంలేదు. ఇలాంటి వారికి చేదోడుగా ఉండేందుకు నగరానికి చెందిన ఓ ఎన్జీవో ముందుకొచ్చింది. ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఉచిత హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసి రోగులు, వారి బంధువులకు సాయపడుతోంది.

information of corona victims will be given by help desk
కొవిడ్‌ బాధితుల ఆచూకీ తెలియడం లేదా?!

By

Published : Sep 11, 2020, 1:15 PM IST

రోనా బారిన పడిన ఓ వ్యక్తి నాలుగు నెలల కిందట గాంధీ ఆసుపత్రిలో చేరారు. రెండు, మూడు రోజులపాటు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత ఫోన్‌ రావడం ఆగిపోయింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రి అధికారులను ఆరా తీయగా ఆసుపత్రిలో లేడని చెప్పారు. పోలీసులను సంప్రదించినా అదే సమాధానం వచ్చింది. చివరికు ఉన్నతాధికారులు రంగంలోకి దిగితే, మార్చురీలో అతని మృతదేహం గుర్తించారు.

సమాచారం తెలియక లబోదిబో..

సాధారణ రోగాలతో ఆసుపత్రిలో చేరితే తప్పనిసరిగా సహాయకుణ్ని అనుమతిస్తారు. కొవిడ్‌ బాధితులకు మాత్రం సహాయకులను అనుమతించడంలేదు. చిన్న పిల్లలకు మినహాయింపు ఇచ్చారు. గాంధీ ఆసుపత్రిని కొవిడ్‌ బాధితుల కోసం ప్రత్యేకించారు. ఇతరులెవర్నీ లోపలకు అనుమతించడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల్లో కొందరి వద్ద చరవాణులు ఉండటం లేదు. ఉన్నవారికీ ఛార్జింగ్‌ పెట్టుకోవడం తెలియక ఒకట్రెండు రోజుల పాటు క్షేమ సమాచారం ఆగిపోతోంది. ఎవరిని సంప్రదించాలో తెలియక కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కుదుటపడి ఇంటికెళ్లేందుకు కొందరు బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. తీసుకెళ్లేందుకు ఆటోలు, ప్రైవేటు వాహనాలు ముందుకు రావడం లేదు. అధిక ఛార్జీ ఇస్తే కొందరు తీసుకెళుతున్నారు. గర్భిణులు, మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల వద్ద ఉచితంగా సేవలు అందించేందుకు హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ ముందుకు రావడం రోగులతో ఎంతో ఊరటగా ఉంటోంది.

నాలుగు సహాయ కేంద్రాలు

హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌(హెచ్‌హెచ్‌ఎఫ్‌).. గాంధీ, ఉస్మానియా, కింగ్‌కోఠి, ఛాతీ, పేట్లబుర్జు ప్రసూతి ఆసుపత్రుల వద్ద వైద్యాధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. రోగుల యోగ క్షేమాలు ఈ డెస్క్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్ఛు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. కోలుకున్న బాధితులు, బాలింతలను క్షేమంగా ఇళ్లకు చేర్చేందుకు ఉచిత అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. గాంధీలో ప్రత్యేకించి రెండు అంబులెన్సులు ఏర్పాటు చేశామని హెచ్‌హెచ్‌ఎఫ్‌ అధ్యక్షుడు ముజ్తబా హసన్‌ అక్సారీ తెలిపారు. గాంధీలోని బాధితుల సమాచారం, ఇతర వివరాలకు 99635 04117, 95428 09069 నంబర్లలో సంప్రదించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details