Thefts in Sankranti Holidays : సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవులు. దీంతో జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ పట్టణాల్లోని అధికశాతం ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు వెళ్లడం సాధారణం. ఇదే అదనుగా దొంగలు చెలరేగిపోతారు. గతంలో జరిగిన పలు దొంగతనాలకు తాళాలు వేసి ఉన్న ఇళ్లే కేంద్రమయ్యాయి. కాబట్టి ఊళ్లకు వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా పోలీసు అధికారి ఎన్.కోటిరెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు.
ఇలా చేయండి..
- ఊళ్లకు వెళ్లే వారు తలుపులకు తాళాలు కనిపించేలా వేయకూడదు. అడ్డుగా తెర వేయాలి. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను, నగదు ఇళ్లల్లో ఉంచుకోకూడదు.
- పక్కింటివారికి చెప్పి వెళ్లడం, గదిలో, వరండాలో లైటు వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలి.
- బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు వచ్చి రోజూ చూసి వెళ్లేలా, పగటిపూట లైట్లు ఆర్పి, చీకటి పడగానే మళ్లీ వేసేలా ఏర్పాటు చేసుకోవాలి.
- దినపత్రిక వేసుకునే అలవాటు ఉన్నవారు వాటిని అలాగే ఉంచితే ఇంట్లో ఎవరూ ఉండటం లేదన్న విషయం తెలిసిపోతుంది. అందుకే రోజు దినపత్రికలను తీసి ఉంచమని పక్కింటివారికి చెప్పాలి.