Dr.Sunitha Narreddy interview on covid new variant: గత ఏడాది జులై, ఆగస్టు నెలల నాటి మూడోదశ కొవిడ్ ఉద్ధృతి నుంచి నెమ్మదిగా తేరుకుంటున్న సమయంలో.. ఇప్పుడు నాలుగో దశ మొదలవుతోందన్న సంకేతాలతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ప్రస్తుతం దేశంలో బయటపడుతున్న కొత్తరకం ఒమిక్రాన్ వైరస్ బీఎఫ్ 7 రకం భయభ్రాంతులకు గురిచేస్తోంది. చైనాలో విరుచుకుపడుతున్న ఈ వైరస్ కేసులు భారత్‌లోనూ వెలుగు చూశాయి. ఈ వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెంది అత్యధిక మరణాలకు దారితీస్తోందని, దీని లక్షణాలు సాధారణ కొవిడ్ మాదిరిగా కనిపించవని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరందుకోవడంతో.. జనం బెంబేలెత్తే పరిస్థితి.
ఈ ప్రచారంలో వాస్తవాలు లేవని, వాటిలో శాస్త్రీయత లేదని ఇన్‌ఫెక్షన్ వ్యాధుల (ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్) నిపుణురాలు, అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సునీత నర్రెడ్డి కొట్టిపారేశారు. చైనాలో విజృంభించినంతగా బీఎఫ్ 7 ఉద్ధృతి మన దగ్గర కొనసాగే అవకాశాలు తక్కువని చెప్పారు. కానీ దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా వంటి జనసాంద్రత అధికంగా ఉండే మహానగరాల్లో కేసుల సంఖ్య అమాంతం పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషించారు. ఈ వైరస్‌పై నెలకొన్న సందేహాలను ఆమె 'ఈనాడు-ఈటీవీ భారత్' ముఖాముఖిలో నివృత్తి చేశారు.
- చైనాలో విజృంభిస్తున్న బీఎఫ్ 7 రకానికి చెందిన ఒమిక్రాన్ వైరస్ ప్రభావం మన దగ్గర ఎలా ఉండబోతోంది?
చైనాలో మొదట్నించీ లాక్‌డౌన్ నడుస్తోంది. అక్కడి ప్రజల్లో వైరస్ బారినపడిన వారి శాతం చాలా తక్కువ. దీంతో సహజసిద్ధంగా లభించే రోగ నిరోధక శక్తి చైనీయుల్లో కొరవడింది. వైరస్ మార్పులకు అనుగుణంగా ఆ దేశ టీకాలను అభివృద్ధి చేయకపోవడంతో అవి కొత్త వేరియంట్లను అడ్డుకోవడంలో విఫలమవుతున్నాయి. ఇలా రెండు రకాలుగా చైనా ప్రజల్లో రోగనిరోధకశక్తి సన్నగిల్లడంతో వైరస్ విజృంభిస్తోంది. భారత్‌లో రెండోదశలో డెల్టా వేరియంట్ వ్యాపించిన సందర్భంలో మనం చూసిన తీవ్రతనే ఇప్పుడు చైనాలోనూ ఎదుర్కొంటున్నారు. మన దేశంలో దాదాపు అర్హులైన వారంతా రెండు డోసుల టీకాలు పొందారు. పెద్దఎత్తున ఇన్‌ఫెక్షన్ బారిన కూడా పడ్డారు. దీంతో సహజసిద్ధంగా లభించే హెర్డ్ ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంది. బీఎఫ్ 7 అనేది భారత్‌లో కొత్తగా వచ్చిందేమీ కాదు. సెప్టెంబరు నుంచే ఇక్కడ వ్యాప్తిలో ఉంది. మూడు నెలలు దాటినా, ఉద్ధృతి కనిపించలేదు. కొత్తగా కేసులు పెరిగేదేముంది?
- కొవిడ్ తొలిదశలో.. చైనాలో మన కంటే ముందుగా నవంబరు 2019లో వైరస్ విజృంభించింది. తర్వాత భారత్‌లో 2020 మార్చి, ఏప్రిల్‌లో వైరస్ జాడలు కనిపించాయి. ఇప్పుడు కూడా అలా వచ్చే నాలుగైదు నెలల్లో వ్యాప్తి పెరిగే అవకాశాలున్నాయా?
ఇప్పుడు కొత్త రకం వైరస్ భారత్‌లో ప్రవేశించి మూణ్నెల్లు దాటినా కేసుల సంఖ్యలో అనూహ్య పెరుగుదల లేదు. కొవిడ్‌కు ముందు మాదిరే ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటే.. దేశవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువే. ఒకవేళ పెరిగితే వచ్చే జనవరికల్లా తెలుస్తుంది. కానీ 2020, 2021లో మాదిరిగా కేసులు పెరగవు. మన దగ్గర వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువే. మనవద్ద ఎప్పటికప్పుడు వైరస్ జన్యుక్రమ విశ్లేషణ (జీనోమ్ సీక్వెన్సింగ్) పరీక్షలు జరుగుతున్నాయి. వాటిలో ఏదైనా కొత్తరకం ప్రమాదకరంగా ఉందని తేలితే.. వెంటనే అప్రమత్తమయ్యేందుకు భారత్‌లో అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో పటిష్ఠ యంత్రాంగాన్ని నెలకొల్పింది.
- అమెరికా, యూరప్ దేశాల్లోనూ వ్యాక్సిన్లు ఇచ్చారు.. అయినా అక్కడ ఎందుకు కేసులు పెరుగుతున్నాయి?