పరిశ్రమలు తప్పని సరిగా కేంద్ర, రాష్ట్రాలు సూచించిన మార్గదర్శకాలకు లోబడి పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. పని వాతావరణంలో భౌతిక దూరం, పరిశుభ్రత వంటివి విధిగా పాటించాలని కోరింది. పరిశ్రమల పునరుద్ధరణపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ అధికారులు.. తెలంగాణ పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సీనియర్ పారిశ్రామిక వేత్తలు, పలు పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొని పని వాతావరణం, విధి విధానాలపై జయేష్ రంజన్ చర్చించారు.
6 నుంచి 6 వరకే...
పారిశ్రామిక వాడలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పారిశ్రామిక ఎస్టేట్స్లు పని ప్రారంభించవచ్చని తెలిపారు. ఉద్యోగులను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పని చేసేలా చూడాలని ఆయన కోరారు. 24 గంటలు పనిచేసే కంపెనీలు కార్మికులను రాత్రి పని స్థలాల్లోనే ఉంచుకోవాలని సూచించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పోలీసులు అనుమతించేలా, అనుమతి పత్రాలు ఆయా కంపెనీలు జారీ చేయాలన్నారు. వీటిని పోలీసులు అనుమతించేలా చూడాలని జయేష్ రంజన్ కోరారు.