Industrialist Ramachandra Yadav comments: తనను హతమార్చడానికి వైసీపీ నాయకులు జరిపిన దాడి కేసులో పురోగతి లేకపోవడంతో త్వరలో సీబీఐకి వినతి చేస్తానని పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించిన తర్వాత తొలిసారిగా ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకుల ప్రోత్సాహం, కొందరు పోలీసుల సహకారంతో తన కార్యక్రమాలను అడ్డుకోవడం, ఇంటిపై దాడిచేయడం వంటి ఘటనలను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరించడంతో.. ఆయన స్పందించి వై ప్లస్ భద్రత కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో ముఖ్యంగా.. చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుల ఆగడాలు, పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలతో దౌర్జన్యాలు అధికమయ్యాయని ఆరోపించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి పైనే పోటీ చేస్తానని.. అధికార పార్టీ, మంత్రిపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని.. ఎన్నికల్లో తన గెలుపు ఖాయమన్నారు. నియోజకవర్గంలో గ్రామగ్రామాన పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తానని తెలిపారు. తనకు మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటానని, గ్రామాల్లో ఎక్కడికక్కడ వైసీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలను అడ్డుకోవాలని కోరారు.