తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాలకు పారిశ్రామిక యోగం... - TELANGANA INDUSTRIAL AREA LOCAL AUTHORITY (IALA)

రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం చేపట్టిన కసర్తతులు కొలిక్కి వచ్చాయి. 14 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చరుగ్గా సాగుతున్నాయి.

పల్లెలకు నూతన పారిశ్రామిక శోభ

By

Published : Nov 4, 2019, 7:48 AM IST

పరిశ్రమల విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని 14 జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పది జిల్లాల్లో ఆటోనగర్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ భూ బ్యాంకులోని స్థలాలు, సేకరించిన భూముల్లో వీటిని త్వరలోనే ప్రారంభించనున్నారు. కొత్త పారిశ్రామిక విధానంలో భాగంగా ప్రభుత్వం వికేంద్రీకరణను ప్రకటించింది. జిల్లాకు ఒకటి నుంచి అయిదు చొప్పున పారిశ్రామిక వాడల ఏర్పాట్లు మెుదలుకానున్నాయి. ఇవన్నీ పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకే కేటాయిస్తున్నారు.

నోటిఫై అనంతరం ఐలా హోదా...

పరిశ్రమల శాఖ, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ)లు వీటికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులతో సమావేశాలు నిర్వహించి రూపొందించిన కొత్త పార్కుల ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆమోదం తెలిపారు. ప్రభుత్వం వీటిని పారిశ్రామిక పార్కులుగా నోటిఫై చేసి, పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికార సంస్థ (ఐలా) హోదాను కల్పిస్తుంది. వీటి ఏర్పాటుతో ఆయా జిల్లాల అభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. ఒక్కో పార్కుకు 300 నుంచి వెయ్యి ఎకరాల వరకు కేటాయిస్తారు. స్థానిక పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యమిస్తూ ఒక్కో చోట మూడు వేల నుంచి పదివేల మందికి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

ఒక్కో ఆటోనగర్‌కు 300 నుంచి 500 ఎకరాలు...

భారీ వాహనాల క్రయ విక్రయాలు, మరమ్మతుల కోసం ఆటోనగర్లను అన్ని జిల్లాలకు విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా పది జిల్లాల్లో స్థలాలను పరిశ్రమల శాఖ గుర్తించింది. ఒక్కో ఆటోనగర్‌కు 300 నుంచి 500 ఎకరాల వరకు స్థలాన్ని కేటాయిస్తారు. భారీ వాహనాల పార్కింగ్‌కు అవకాశం కల్పిస్తారు. ఆటోనగర్‌లతో వాహన రంగ వృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా. ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశ్రామిక పార్కులు, ఆటోనగర్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి తెలిపారు. భూములు కేటాయించి... ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో వీటిని ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కొత్త పారిశ్రామిక పార్కులు ఎక్కడంటే...

  • స్టేషన్‌ ఘన్‌పూర్‌, కల్లెం (జనగామ జిల్లా)
  • నర్మాల, పెద్దూరు, జిల్లెల (సిరిసిల్ల)
  • చిట్యాల (నల్గొండ) - వెలిగొండ (వనపర్తి)
  • జంగంపల్లి (కామారెడ్డి)
  • బెజ్జంకి, దుద్దెడ, నర్మెట్ట, మందపల్లి, తునికి బొల్లారం (సిద్దిపేట)
  • చందన్‌వెల్లి, ఇబ్రహీంపట్నం, మొండి గౌరెల్లి, కొత్తపల్లి, నాగిరెడ్డిపల్లి (రంగారెడ్డి)
  • మాదారం, బౌరంపేట, దుండిగల్‌ (మేడ్చల్‌)
  • నెన్నెల (మంచిర్యాల) - స్తంభంపల్లి (జగిత్యాల)
  • గద్వాల (జోగులాంబ గద్వాల)
  • సూర్యాపేట
  • వడియారం, మనోహరాబాద్‌ (మెదక్‌)
  • అంతర్గాం (పెద్దపల్లి)

ప్రతిపాదిత ఆటోనగర్‌లు

  • రామగుండం (పెద్దపల్లి జిల్లా)
  • బాన్స్‌వాడ (కామారెడ్డి)
  • తాండూరు (వికారాబాద్‌)
  • మిర్యాలగూడ (నల్గొండ)
  • నాగ్‌పుర్‌, ముంబయి, బెంగళూరు జాతీయ రహదారులకు సమీప గ్రామాలు
  • వనస్థలిపురంలోని ఆటోనగర్‌ను బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) బయటికి తరలించి, రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్‌ జిల్లాల్లోని మూడు గ్రామాల వద్ద కొత్తవి ఏర్పాటు చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details