Indiramma Indlu Scheme 2024 Telangana :సొంతింటి కల నెరవేర్చుకోవడంపై పేద, మధ్యతరగతి ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవలే కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల నగదు, అలాగే స్థలం లేని వారికి స్థలంతో పాటు, ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో ఆ పథకం కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద స్వీకరించిన దరఖాస్తులను యథాతథంగా ఆమోదిస్తారా? లేక ఇందిరమ్మ పథకానికి మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఈ పథకంపై ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలేవీ రాకపోయినా జనం మాత్రం ప్రభుత్వ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. మంగళ, శుక్రవారం నిర్వహించిన ప్రజావాణిలో ఇళ్ల కోసం దరఖాస్తులు ఇస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది - సిద్ధరామయ్యకు కేటీఆర్ కౌంటర్
Telangana Indiramma Houses Scheme Latest News :రాష్ట్రంలో ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకునేందుకు గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకానికి త్వరలో కాలం చెల్లనుంది. ఆ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రానున్నట్లు తెలుస్తోంది. గృహలక్ష్మి పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రకటించింది. ఆ పథకం అమలు కోసం ఈ ఏడాది జూన్‌లో ఉత్తర్వులు జారీ చేయగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మూడు వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేసింది.
ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలను దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించి దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాలు ఆయా జిల్లాల కలెక్టర్ల వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ వారికి మంజూరు పత్రాలు ఇవ్వలేదన్న విషయాన్ని అధికార వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. ఎన్నికలకు ముందుకాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme 2024) కింద ఇంటి నిర్మాణానికి చేయూత ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకానికి త్వరలో తెరపడనున్నట్లు సమాచారం. గృహలక్ష్మి స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రానున్నట్లు తెలిసింది.
ఇంటి నిర్మాణానికి రూ.అయిదు లక్షలు :ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలం ఉన్న పేదలు ఇంటిని నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రకటించింది. స్థలం లేని వారికి స్థలంతో పాటుగా రూ.5 లక్షలు ఇస్తామని వెల్లడించింది. అదే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు మరో రూ.లక్ష అదనంగా ఇస్తామని తెలిపింది. ప్రస్తుతం ఈ పథకాన్ని ఏ రూపంలో తీసుకురావాలి? ఎన్ని దశల్లో చేపట్టాలి? ఎన్నింటిని మంజూరు చేయాలి? లబ్ధిదారుల ఎంపిక ఎలా? తదితర అంశాలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మేధోమథనం చేయనుంది.
రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకానికి ఒక స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా నిర్మాణంలో ఉన్న రెండు పడకల ఇళ్ల తీరుతెన్నులపై కాంగ్రెస్ సర్కార్ అధ్యయనం చేయనున్నట్లు సమాచారం. అధికారుల వద్ద గణాంకాలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన మీదట గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. తదనంతరం ఆ ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం - శాసనసభా వేదికగా లెక్కతేల్చనున్న ప్రభుత్వం
నల్గొండలో గత ఐదేళ్లు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క : మంత్రి కోమటిరెడ్డి