టిక్ టాక్, బ్యూటీ ప్లస్, కామ్ స్కానర్, షేర్ ఇట్, ఇలాంటి ఎన్నో యాప్స్ లేకుండా మొన్నటివరకు మొబైల్ ఫోన్ నడిచేది కాదు. ఈ యాప్స్‌తో మనకు అవసరమైన ఎన్నో పనులు చేసుకోవడమే కాక.. వినోదానికి ఢోకా ఉండేది కాదు. టిక్ టాక్‌నే తీసుకుంటే.. ఈ యాప్‌కు ఒక్క భారత్‌లోనే మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దీనితో ఫేమస్ అయినవాళ్లు, తమ టాలెంట్‌ను నిరూపించుకుంటూ అవకాశాలు పొందినవారు అనేక మంది ఉన్నారు. ఈ యాప్స్ వల్ల మన దేశం నుంచి చైనాకు ఎన్నో కోట్ల రూపాయల ఆదాయం సమకూరేది. ఇవన్నీ భారత యువత జీవితాల్లో మమేకమయ్యాయనే చెప్పాలి.
అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. మన దేశ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం అవలంభిస్తున్న చర్యలతో యువత ఆలోచనలో పడింది. అప్పటికే ప్రారంభమైన స్వదేశీ ఉద్యమానికి మద్దతు తెలిపిన యువత.. 59 చైనా యాప్స్‌ను నిషేధిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఆ యాప్స్‌తో ఎంతగా ముడిపడిపోయినా దేశం కంటే ఏదీ ముఖ్యం కాదని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మన దేశం-మన ఐక్యత ముందు యాప్లనేవి చిన్న విషయం అంటూ తేల్చేస్తున్నారు. ఇకపై మన ఇండియన్ యాప్స్ లోనే తమ ప్రతిభ చూపిస్తామని అంటున్నారు టిక్ టాక్ సెలబ్రిటీస్...