తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించే పతకాల్లో విశిష్టమైన రాష్ట్రపతి పోలీసు పతకం ఆయన్ని వరించింది.
పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారుల్ని ఈ పతకానికి ఎంపిక చేస్తారు. సంబంధిత పతకానికి ఈ దఫా రాష్ట్రం నుంచి ఆయనొక్కరే ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లా తులేకలాన్ గ్రామానికి చెందిన శివధర్‌రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా పోలీసు శాఖలో అడుగుపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ, శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్‌లో డీసీపీగా పనిచేశారు. ప్రస్తుతం అదనపు డీజీపీ(పర్సనల్)గా పనిచేస్తున్నారు.
విధుల్లో ప్రతిభ చూపినందుకు ఇచ్చే పోలీసు పతకాల(పోలీస్ మెడల్స్)కు మరో 12 మంది అధికారులు ఎంపికయ్యారు. అకున్ సభర్వాల్(ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు), ఆర్.వేణుగోపాల్(ఆదిలాబాద్ బెటాలియాన్ కమాండెంట్), ఇక్బాల్ సిద్దిఖీ(అదనపు డీసీపీ-హైదరాబాద్ ఎస్‌బీ), పి.సత్యనారాయణ(బీచ్‌పల్లి బెటాలియన్ అదనపు కమాండెంట్), దేవనబోయిన ప్రతాప్(నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ), ఘంట వెంకట్రావు(ఖమ్మం ఏసీపీ), సామ జయరాం(నల్గొండ విజిలెన్స్ డీఎస్పీ), శ్రీరంగం రవీంద్రనాథ్(కొండాపూర్ బెటాలియన్ ఆర్‌ఎస్సై), కె.సుధాకర్(వరంగల్ ఏఎస్సై), ఎం.నాగలక్ష్మి(టీఎస్పీఏ ఏఎస్సై), ఆర్.అంతిరెడ్డి(శంషాబాద్ ఎస్‌వోటీ ఏఎస్సై), డి.రమేశ్‌బాబు(గ్రేహౌండ్స్ పీసీ) ఈ జాబితాలో ఉన్నారు.
ఇదీ చదవండి:పుణ్యక్షేత్రాలను సందర్శించు... పారితోషికం పట్టు