Indian Government To Increase Millet Cultivation : దేశ వ్యవసాయ రంగంలో రోజురోజుకు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 60వ దశకంలో విజయవంతమైన హరిత విప్లవం నేపథ్యంలో ఎన్నో మైలురాళ్లు సాధించిన భారత్ ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమ, పప్పులు, పండ్లు, కూరగాయలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. ఇదే క్రమంలో వ్యవసాయంలో విప్లవాత్మక ఆవిష్కరణలు, కొత్త కొత్త సాంకేతికతలు అమలు చేయడం ద్వారా గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్టైంది.
దేశంలో చిరుధాన్యాల విప్లవంపై దృష్టి సారించిన కేంద్రం
మొదట ఆసియా, ఆఫ్రికాలో ఖండాల్లో సాగైనా తర్వాత అభివృద్ధి చెందుతోన్న దేశాల్లోకి తృణధాన్యాల పంటలుగా వ్యాప్తి చెందాయి. 2021-22లో ప్రపంచవ్యాప్తంగా 75.35 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో చిరుధాన్యాల పంటలు సాగు చేయగా ఉత్పత్తి 97.15 మిలియన్ మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చినట్టు ఎఫ్ఏవో వెల్లడించింది. వీటిలో జొన్న, సజ్జ ప్రధాన పంటలు కాగా తర్వాతి స్థానంలో రాగి ఆ తర్వాత కొర్రలు, వరిగెలు, ఊదలు, అరికెలు వంటివి ఉన్నాయని ప్రపంచ ఆహార సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా భారత్‌లో చిరుధాన్యాలను రోజు వారీ ఆహారంలో భాగం చేయాలని నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
తృణధాన్యాల విత్తనాలకు పెరిగిన డిమాండ్
వాతావరణ మార్పులు అనేక దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిర వర్షపాతం, కరవుల వల్ల పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో చిరు ధాన్యాల సాగును విస్తృతంగా చేపట్టడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 140 కోట్లకు పైగా ఉన్న భారత జనాభాకు పోషకాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని, అందుకోసం చిరు ధాన్యాల సాగును భారీగా చేపట్టాలని చెబుతున్నారు. ఆహార భద్రతతోపాటు పోషకాల పరంగానూ ఎంతో ప్రాధాన్యం ఉన్న చిరుధాన్యాల సాగును పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి.
Millets Cultivation In India : ఆహారంలో భాగం చేసి చిరుధాన్యాలు ఉత్పత్తులను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మిల్లెట్ కేఫ్‌ల ఏర్పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అంతేకాకుండా రాబోయే కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయా పంటల సాగు విస్తీర్ణం పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో భారత్ చిరుధాన్యాలకు హబ్‌గా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.