Indian-American Krishna Vavilala : ‘‘మహాత్మాగాంధీని ప్రత్యక్షంగా చూసిన అమెరికాలోని అతికొద్దిమంది వ్యక్తుల్లో నేనొకణ్ని. 1946లో మహాత్ముడు మా సొంత ఊరైన ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి వచ్చినపుడు నా వయసు తొమ్మిదేళ్లు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. గాంధీని చూసేందుకు మా అమ్మమ్మ నన్ను, నా ఇద్దరు సోదరీమణులను ఎడ్లబండిపై పిలుచుకుపోయింది’’ అని ఇండో - అమెరికన్ కృష్ణ వావిలాల (86) తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
గత అయిదు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటున్న ఈయన భారతీయులు, అమెరికన్ల మధ్య సుహృద్భావ సంబంధాల ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. అమెరికన్ మానవహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ (ఎంఎల్‌కే) జూనియర్ జయంతి (జనవరి 15) సందర్భంగా కృష్ణ వావిలాలకు ఎంఎల్‌కే గ్రాండ్ పరేడ్ స్పెషల్ అవార్డు అందజేశారు. హ్యూస్టన్‌లో నివాసం ఉంటున్న కృష్ణ బిట్స్ పిలాని పూర్వ విద్యార్థి.. ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పదవీ విరమణ పొంది, ‘ఫౌండేషన్ ఆఫ్ ఇండియా స్టడీస్’ (ఎఫ్‌ఐఎస్) సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు.