తెలంగాణ

telangana

ETV Bharat / state

బీటెక్‌లకే గిరాకీ.. 2023లో కొలువులు సాధించే వారిలో 31% మంది వీరే.. - 5 courses that employers prioritise while hiring

India Skills Report 2023 : 2023లో తాజా బీటెక్‌ గ్రాడ్యుయేట్లకు డిమాండ్ ఏర్పడనుంది. వీరిలో 31 శాతం మందిని నియమించుకోవాలని సంస్థలు చూస్తున్నాయని భారత నైపుణ్యాల నివేదిక తెలిపింది. మరోవైపు బీమా రంగాల్లో 41 శాతం, ఇంటర్నెట్‌ బిజినెస్‌లో 38 శాతం మందికి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు తాజాగా విడుదలైన భారత నైపుణ్యాల నివేదిక-2023 స్పష్టం చేసింది.

India Skills Report 2023
India Skills Report 2023

By

Published : Dec 17, 2022, 10:29 AM IST

India Skills Report 2023 : కొత్త సంవత్సరంలో తాజా బీటెక్‌ గ్రాడ్యుయేట్లకు డిమాండ్‌ అధికంగానే ఉండనుంది. ప్రస్తుత ఏడాదిలో వివిధ కంపెనీల్లో కొలువులు సాధించిన వారిలో 32 శాతం మంది బీటెక్‌ పట్టభద్రులు ఉండగా.. 2023లో 31 శాతం మందిని నియమించుకోవాలని సంస్థలు భావిస్తున్నాయి. దేశవ్యాప్తంగా భర్తీ చేసే కొత్త ఉద్యోగాల్లో దాదాపు మూడో వంతు బీటెక్‌ అభ్యర్థులకే దక్కనున్నాయి. తాజాగా విడుదలైన భారత నైపుణ్యాల నివేదిక-2023 ఈ విషయాన్ని వెల్లడించింది.

ముఖ్యంగా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అభ్యర్థులకు అత్యధిక డిమాండ్‌ ఉందని తెలిపింది. అదే సమయంలో మెకానికల్‌ ఇంజినీర్లు పనిచేసే రంగాల్లో గణనీయ వృద్ధి ఉందని పేర్కొంది. ‘బీటెక్‌ అభ్యర్థులకు బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా(బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో అత్యధికంగా 41 శాతం గిరాకీ ఉంది. ఈ రంగంలో 1-5 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి స్వల్పంగా డిమాండ్‌ పెరగనుంది. ఆటోమోటివ్‌లో 30 శాతం మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంటర్నెట్‌ బిజినెస్‌(ఈ-కామర్స్‌, ఆన్‌లైన్‌ తదితరాలు)లో 38 శాతం డిమాండ్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులకే ఉన్నట్లు’ నివేదిక పేర్కొంది.

నివేదికలో ముఖ్యాంశాలు

* ఆటోమోటివ్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజినీరింగ్‌/ఉత్పత్తి తరహా పరిశ్రమలు, ఇంటర్నెట్‌ బిజినెస్‌లో 1 నుంచి 2 శాతం డిమాండ్‌ పెరగనుంది. ఫార్మా/హెల్త్‌కేర్‌, ఐటీ/సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో 2 శాతం చొప్పున గిరాకీ తగ్గనుంది.

* ఐటీ, సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు బీటెక్‌ అభ్యర్థులతో దాదాపు సమానంగా అంటే 25 శాతం మందిని ఎంటెక్‌, ఎంసీఏ, ఎంఎస్‌సీ, ఎంకాం పూర్తి చేసిన వారిని నియమించుకోనున్నాయి. ఫార్మా/హెల్త్‌ కేర్‌ రంగంలోనూ బీటెక్‌తో సమానంగా బీఏ, బీసీఏ, బీబీఏ, బీకాం, బీఎస్‌సీ తదితర విద్యార్థులను తీసుకోనున్నాయి.

* ఆయా రంగాల్లో ప్రత్యక్ష అనుభవం కోసం 90 శాతానికిపైగా విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కోరుకుంటున్నారు. అందులో అత్యధికంగా ఏపీ నుంచి 93.50 శాతం మంది(వీబాక్స్‌ నేషనల్‌ ఎంప్లాయిబిలిటీ టెస్ట్‌ రాసినవారిలో) ఇంటర్న్‌షిప్‌ కావాలని కోరుకున్నారు.

ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు పెంచాలి:తాజా గ్రాడ్యుయేట్లకు డిమాండ్‌ పెరుగుతోంది. యువత తమలోని లోపాలను, ఇంకా ఎటువంటి నైపుణ్యాలు అవసరమో తెలుసుకోవాలంటే ఇంటర్న్‌షిప్‌ చేయాలి. దీని వల్ల ప్రత్యక్ష శిక్షణ లేకుండానే పనిచేసేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, ఏఐసీటీఈ, యూజీసీ లాంటి సంస్థలు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను పెంచాలి. కళాశాలలూ దృష్టి సారించాలి. లేకుంటే మంచి అవకాశాలను యువత కోల్పోతారు.- కాంచనపల్లి వెంకట్‌, సీఈఓ, సన్‌టెక్‌ కార్ఫ్‌, ప్లేస్‌మెంట్‌ శిక్షణ సంస్థ

ఇవీ చదవండి:మాటల్లో తెలంగాణ.. రాతల్లో ఆంధ్రప్రదేశ్‌..

యుద్ధభూమిలో పర్యటక శోభ.. 'తవాంగ్‌'కు తరలివస్తున్న టూరిస్ట్​లు

ABOUT THE AUTHOR

...view details