‘రెమిడెసివిర్’ ఔషధం కొవిడ్-19 బాధితులపై పనిచేస్తున్నట్లు ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైనందున దీన్ని విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా సంస్థ గిలీడ్ సైన్సెస్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఔషధం తయారీ, విక్రయాల్లో భారతీయ ఔషధ కంపెనీలను భాగస్వాములను చేయనుంది. దీన్ని కొవిడ్-19 బాధితులపై వినియోగించడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అత్యవసర అనుమతి (ఎమెర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్) ఇచ్చింది. దీంతో ఔషధ పరీక్షలు, తయారీ యత్నాలను గిలీడ్ సైన్సెస్ వేగవంతం చేసింది. కొవిడ్-19కు ఇది సరైన ఔషధమేనని పూర్తిస్థాయిలో నిర్ధారణ అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది.
అటువంటి పరిస్థితుల్లో సరఫరాలు పెంచేందుకు వీలుగా మనదేశంలో జనరిక్ ఔషధాలు తయారు చేసే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవటానికి గిలీడ్ సైన్సెస్ సిద్ధపడుతోంది. ‘రెమిడెసివిర్’ ఔషధంపై గిలీడ్ సైన్సెస్‌కు దాదాపు 70 దేశాల్లో 2031 వరకు పేటెంట్లు ఉన్నాయి. అందువల్ల గిలీడ్‌ను కాదని ఇతర కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేయటం సాధ్యం కాదు. భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం ద్వారా మాత్రమే చేయొచ్చు. గతంలో స్వైన్‌ఫ్లూ వచ్చినప్పుడు కూడా, ఆ జబ్బును అదుపు చేసే ఔషధమైన ‘ఒసెల్టామివిర్’ ఔషధం తయారీకి గిలీడ్ సైన్సెస్ మనదేశంలోని ఫార్మా కంపెనీలను ‘వలంటరీ లైసెన్స్’ పద్ధతిలో భాగస్వాములను చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అదే పద్ధతిని ఇప్పుడు అనుసరించనుంది.
తయారీ పరిజ్ఞానం బదిలీ!
ఒప్పందంలో భాగంగా ఎంపిక చేసుకున్న దేశీయ ఫార్మా కంపెనీలకు ఔషధ తయారీ పరిజ్ఞానాన్ని గిలీడ్ సైన్సెస్ బదిలీ చేస్తుంది. భాగస్వామ్యాల విషయంలో కొన్ని ఐరోపా దేశాలు, ఆసియాలోని భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లోని కొన్ని జనరిక్ ఫార్మా కంపెనీలతో సంప్రదింపులు చేపట్టినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో అధికారికంగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కంపెనీలతో కలిసి ‘తయారీదార్ల బృందాన్ని’ ఏర్పాటు చేయనున్నట్లు, తద్వారా తక్కువ సమయంలో విస్తృత స్థాయిలో ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు గిలీడ్ సైన్సెస్ వెల్లడించింది.