ప్రపంచ సినిమాకు వేదిక హైదరాబాద్: కేటీఆర్ సరికొత్త ఆలోచనలకు వేదిక కల్పిస్తూ... ఔత్సాహికులకు వినూత్న, అధునాతన సాంకేతికతను పరిచయం చేస్తూ... అట్టహాసంగా సాగింది ఇండియా జాయ్-2019 మొదటి రోజు. హైటెక్స్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో గ్రాఫిక్స్, యానిమేషన్, గేమింగ్ రంగాల్లో దిగ్గజ సంస్థలతో పాటు, అంకుర సంస్థలూ తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఆలోచనలనూ పంచుకున్నాయి.
ఇండియా జాయ్‌లో కేటీఆర్
ఈ అంతర్జాతీయ వేడుకకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు వంశీ పైడిపల్లి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ట్వాగా అధ్యక్షుడు రాజీవ్ చిలక హాజరయ్యారు. చలన చిత్రాలకు, వాటికి అందించే సాంకేతికత భాగ్యనగరం అధునాతన సౌకర్యాలు అందిస్తూ సరైన వేదికగా నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఈనెల 23 వరకు
ఈ కార్యక్రమం 4 రోజుల పాటు జరగనుంది. మొదటి రోజు జరిగిన కార్యక్రమాల్లో వినోదం, సృజనాత్మకత సినిమా తెరను దాటి డిజిటల్ మాధ్యమాల్లోకి ఎలా వస్తోంది..? సమీప భవిష్యత్తులో ఎలాంటి మార్పులు జరగనున్నాయి? ఓవర్ ది టాప్.... ఓటీటీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు, ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఆధునిక సాంకేతితతో కొత్త ఒరవడులు సృష్టిస్తున్న వీఎఫ్ఎక్స్‌ను పరిచయం చేస్తూ.... ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
నాలుగు దశాబ్దాల్లో గ్రాఫిక్స్ రంగంలో ఎలాంటి మార్పులు జరిగాయి. వాటిని వినియోగిస్తూ ఎటువంటి అద్భుతాలు జరిగాయనే అంశాలను వివరించారు. రానున్న ఐదేళ్లలో ఎటువంటి విప్లవాత్మక మార్పులు జరగనున్నాయన్న వాటిపై చర్చలు జరిగాయి. ఔత్సాహికులు తమ ఉత్పత్తులను, ఆలోచనలను ఈ వేదిక ద్వారా ఆవిష్కరించారు.
ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్
ఈ వేడుకలో ప్రత్యేకంగా నిర్వహించిన ఇండీవుడ్ ఫిల్మ్ మార్కెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖండాంతరాలకు వ్యాపిస్తున్న భారతీయ సినిమా అందులో విశేష ప్రతిభ చాటుతోన్న యువ దర్శకులు, రచయితలు వారి ఆలోచనలు పంచుకున్నారు. అలాగే సినిమాకు సంబంధించిన కొంగొత్త టేకింగ్, సాంకేతికత, గ్రాఫిక్స్ మాయాజాలం, కెమెరాలు, లెన్స్‌లు ప్రదర్శించారు. ఔత్సాహికులు తమ వ్యాపార అలోచనలు ఈ వేదిక ద్వారా పంచుకున్నారు. ఇలా ఎంతోమందిని ఒక్కచోటకి చేర్చింది ఇండియా జాయ్ కార్యక్రమం. అలాగే యువ డిజైనర్లూ కార్యక్రమంలో పాల్గొని తమ విజ్ఞానం పంచుకున్నారు. సందర్శకులు ఈ వేడుక నిర్వహణపై ఆనందం వ్యక్తం చేశారు.
రెండో రోజు గేమింగ్
సినిమా, డిజిటల్ రంగాలలో ప్రభావితం చేసిన వ్యక్తుల పేరుతో నిర్వహించిన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. సినీ తారలు ఈ వేడుక మొదటి రోజు సందడి చేశారు. సందర్శకులు సైతం పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రెండోరోజు గేమింగ్, పిల్లల యానిమేషన్ రంగాలకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇవీచూడండి: అవినీతి 'దేవిక': ఒక్క అధికారి... 36 డొల్ల కంపెనీలు!