జపాన్‌తో కీలక రక్షణ ఒప్పందం.. టోక్యో-దిల్లీ దోస్తీపై దృష్టి ఎన్నో ఏళ్లుగా భారత్-జపాన్‌ల బంధం బలంగా ఉంది. జపనీస్ సాంకేతికతతో కార్లు మొదలుకుని... ఎలక్ట్రానిక్ పరికరాల వరకూ దేశంలోని ఎన్నో ఇళ్లల్లో కనిపిస్తాయి. భారతీయ సినిమాలు జపాన్ బాక్సాఫీసుల్లో రికార్డులు కొల్లగొడుతుంటాయి. రెండు దేశాలు పరస్పరం అండగా నిలబడతూ.. ఎప్పటికప్పుడు సాయమందించుకున్నాయి. ప్రధాని మోదీ- జపాన్ ప్రధాని షింజో అబే హయాం మొదలయ్యాక ద్వైపాక్షిక సంబంధాలు మరింత చిక్కబడ్డాయి. ఇరుదేశాల ప్రయోజనాలకు ఉపయోగపడుతోంది వీరిరువురి దోస్తీ.
కొన్నేళ్ల క్రితం ప్రధానిగా భారత్‌కు వచ్చిన షింజో అబే.. ఇక్కడి పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ‘2సముద్రాల సంగమ’ వ్యూహంపై ప్రసంగించారు. అప్పట్లో ఆ ప్రతిపాదన సంచలనం అయింది. ఆయన ప్రస్తావించిన అంశమే ‘ఇండో-పసిఫిక్ వ్యూహంగా రూపాంతరం చెంది చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికాను భారత్‌కు చేరువ చేసింది. చైనా ముప్పును దాదాపు పుష్కర కాలం ముందే పసిగట్టి అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన బలమైన చతుర్భుజ కూటమికి 2007లోనే ప్రాణం పోసింది జపాన్. రక్షణ వ్యూహాల్లో హిందూ-పసిఫిక్ మహా సముద్రాలను కలిపి చూడాల్సిన అవసరాన్ని చెబుతోంది. ఇదే భారత్-జపాన్ సంబంధాలకు మూలస్తంభంగా మారింది.
మోదీ ప్రభుత్వంతో బలమైన సంబంధాలు కొనసాగించారు అబే. 2014లో ప్రధాని మోదీ జపాన్ పర్యటన సందర్భంగా ఇరుదేశాల సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకొనేలా ఓ అణు ఒప్పందానికి బీజం పడింది. 2016లో కుదిరిన ఒప్పందం 2017 నుంచి అమలులోకి వచ్చింది. భారత్‌లోని మౌలిక ప్రాజెక్టులకు జపాన్ భారీగా నిధులు సమకూర్చింది. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు 88వేల కోట్ల రూపాయలు నామమాత్రపు వడ్డీకి ఇచ్చింది.
2016లో భారత ప్రధాని జపాన్ పర్యటన సందర్భంగా 10 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. 2018లో జరిగిన 13వ ఇండో-జపాన్ వార్షిక సదస్సులో ఏకంగా 32 ఒప్పందాలపై సంతకాలయ్యాయి. భారత్‌లో ఏటా జపాన్ పెట్టే పెట్టుబడులు దాదాపు 350 కోట్ల డాలర్లకు చేరాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థలు వెనకడుగు వేస్తే- జపాన్ దాదాపు 13వేల కోట్ల రూపాయలు ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. గువాహటీలో షింజో అబె హాజరుకావాల్సిన 2019 ఇండో-జపాన్ వార్షిక సదస్సు వాయిదా పడటంతో ఈ ప్రతిపాదనలు నిలిచాయి. త్వరలోనే వీటిపైనా స్పష్టత రానుంది.
అలాగే, జపాన్ మార్కెట్ కోసం భారతీయ వస్త్రాలు, దుస్తుల నాణ్యతను మెరుగుపరచడం, పరీక్షించడం కోసం భారత్‌కు చెందిన వస్త్రాల కమిటీ, జపాన్‌కు చెందిన నిస్సెన్కెన్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ సెంటర్ మధ్య అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సాంకేతికవస్త్రాలతో సహా ఇతరవస్త్రాలు, దుస్తుల ఉత్పత్తులు, దేశవిదేశాల్లోని ఖాతాదారులు, కొనుగోలుదారులతో పరస్పరం ఆమోదయోగ్యమైన ఇతర ఉత్పత్తులను తమ తరఫున భారతదేశంలో పరీక్ష, తనిఖీ సేవలు నిర్వహించడంలో సహకరించడానికి వీలుగా వస్త్రాల కమిటీని నియమించుకోడానికి జపాన్ కు చెందిన నిస్సెన్కెన్ క్వాలిటీ ఎవాల్యుయేషన్ సెంటర్ కు ఈ అవగాహనా ఒప్పందం అనుమతిస్తుంది.
కరోనా సమయంలోనూ జపాన్ భారత్‌కు అండగా నిలిచింది. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు అత్యవసర సాయంగా జపాన్ ప్రభుత్వం అధికారిక అభివృద్ధి సహకార ఋణం కింద సుమారు 3500 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిధులను కరోనాపై పోరు కోసం ఆరోగ్యరంగం వినియోగించుకుంటుంది. కరోనా సంక్షోభం మీద పోరాడటంతోబాటు భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్యపరమైన ఉపద్రవాలు ఎదురైనా ఎదుర్కోవటానికి ఈ నిధులు వినియోగిస్తారు. అంటువ్యాధులమీద పోరాటానికి భారత ఆరోగ్య వ్యవస్థ ఈ నిధులను వినియోగి స్తుంది. ఇదే కాకుండా మరో 70 కోట్లు గ్రాంటు రూపంలో జపాన్ ప్రభుత్వం అందజేసింది.
ప్రస్తుతం చైనాకు కళ్లెం వేసేందుకు.. ఇండో-పసిఫిక్ బంధాన్ని మరింత ధృడం చేసేందుకు.. ఏర్పాటైన క్వాడ్‌లో జపాన్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ కూటమిలో 4 దేశాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ.. వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒకే అజెండాపై పనిచేస్తూ ఎవరి సార్వ భౌమత్వం దెబ్బతినకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇప్పుడు తాజాగా భారత్-జపాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందంతో వ్యూహాత్మకంగా... రక్షణ పరంగా రెండు దేశాలూ మరింత సన్నిహితంగా ముందడుగు వేసే అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే భారత్, జపాన్ మధ్య సయోధ్యకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ద్వైపాక్షికాభివృద్ధి సహకారం 1958 నుంచీ ఉంది. గడిచిన కొన్నేళ్ళలో భారత్, జపాన్ మధ్య ఆర్థిక సహకారం మరింత పటిష్టమై, వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారింది.
అయితే ఇప్పుడు.. జపాన్‌లో అధికారమార్పిడి జరగనుంది. ఆధునిక జపాన్‌ను అత్యధిక కాలం పాలించిన నేతగా చరిత్రకెక్కిన షింజో అబే అనారోగ్య కారణాలకో ప్రధాని పదవిలోంచి తప్పుకోనున్నారు. కొత్త ప్రధాని వచ్చినా... ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఎటువంటి ఢోకా ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి:రక్షణ రంగంలో భారత్- జపాన్ కీలక ఒప్పందం