భారతదేశం అంతరిక్ష పరిశోధన కేంద్రానికి దిక్సూచిగా మారే అవకాశం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనలో మొదటి ఆరు దేశాల్లో మన దేశం కూడా ఉండడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం అంతర్జాతీయ ఫౌండేషన్ నిర్వహించిన డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం అంతరిక్ష పరిశోధన పెలోడ్ క్యూబ్స్ ఛాలెంజ్- 2021 కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
దేశంలో జరుగుతున్న భారీ అంతరిక్ష పరిశోధనలో స్వావలంబన, విదేశీ ఉపగ్రహాలను అతి తక్కువ ఖర్చుతో ప్రయోగించడం కీలకమైన అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. విక్రమ్ సారాబాయ్, ఏపీజే అబ్ధుల్ కలాం, సతీశ్ ధావన్ వంటి అనేకమంది ప్రముఖ శాస్త్రవేత్తలు దేశంలో అంతరిక్ష పరిశోధనల అభివృద్ధికి దోహదపడ్డారని తెలిపారు.