ప్రమాదం జరిగిన రెండోరోజు వినాయక చవితి పండగ నాడే సీఐడీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ప్లాంటు లోపలికెళ్లి అణువణువూ పరిశీలించారు. శని, ఆదివారాల్లో సిబ్బందిని అన్ని కోణాల్లో ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు విద్యుదుత్పత్తి ఎలా ఉంది? ఎప్పుడు నిలిపివేశారనే వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో దగ్ధమైన కేబుల్, ప్యానల్ బోర్డులను సీజ్ చేశారు. విద్యుత్ సరఫరా అయ్యే తీగలనూ పరిశీలించారు.
8అధికారులతో సమావేశం
శనివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న సీఐడీ డీజీ గోవింద్‌సింగ్, డీఐజీ సుమతి, ఇతర అధికారులు పవర్‌హౌస్‌లోకి వెళ్లి.. అక్కడ మంటలు చెలరేగిన ప్యానల్ బోర్డులను పరిశీలించారు. జెన్‌కో సంచాలకులు వెంకటరాజం, సచ్చిదానందం, అజయ్, చీఫ్ ఇంజినీర్లు (సీఈలు) సురేశ్, ప్రభాకర్, ఇన్‌ఛార్జి సీఈ ఉమామహేశ్వరచారి, ఎస్‌ఈ హన్మాన్, డీఈలు, ఏఈలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గతంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కడైనా జరిగాయా.. జరిగితే అందుకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదం నుంచి బయటపడిన అధికారులు, సిబ్బందిని కలిసి ప్రమాదం తీరును, వారు తప్పించుకుని బయటపడిన తీరును ఆరా తీశారు. ప్రమాదం నుంచి బయటపడినవారిని విడివిడిగా విచారించారు.