Independents MLC Election 2021 : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. ఆరింటిని అధికార తెరాస ఏకగ్రీవం చేసుకోగలిగింది. మిగతా ఆరుచోట్ల ఎన్నికలు జరిగాయి. మెదక్, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయగా.. మరికొన్ని చోట్ల పార్టీకి చెందిన అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. మెదక్‌లో జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డిని పోటీ చేయగా.. 238 ఓట్లు వచ్చాయి. 230 ఓట్ల కంటే తగ్గితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. మాట నిలబెట్టుకున్నామని నైతిక విజయం తమదేనని జగ్గారెడ్డి సతీమణి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉందంటేనే ఓటర్లకు కవర్లు వచ్చాయి. వారికి విలువ దక్కింది. 230 ఓట్లు వస్తే మేం నెగ్గినట్లేనని మొదటి నుంచి అనుకున్నాం. మేం 238 ఓట్లు సాధించాం. కాబట్టి ఈరోజు మాది కూడా విజయమే.
-నిర్మలా జగ్గారెడ్డి, మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి
కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు!
ఖమ్మంలోనూ కాంగ్రెస్ అభ్యర్థికి పార్టీకి ఉన్న ఓట్ల కంటే ఎక్కువ వచ్చాయి. ఆ పార్టీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు 242 ఓట్లు రాబట్టగలిగారు. క్రాస్ ఓటింగ్‌పై సమీక్షించాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను జిల్లా ఎమ్మెల్యేలు కోరారు. పార్టీ అభ్యర్థిని కాదని కాంగ్రెస్‌కు 142 మంది ఓట్లు వేయడం తెరాసలో చర్చనీయాంశంగా మారింది. తెరాసకు 541 ఓట్లు ఉన్నాయని స్వయంగా ప్రకటించగా.. 480 ఓట్లు మాత్రమే రావడంతో క్రాస్ ఓటింగ్ బహిర్గతమైంది.
తెరాసకు 541 ఓట్లు ఉన్న మాట వాస్తవం. కానీ 480 ఓట్లు వచ్చాయి. దీనిమీద పార్టీలో చర్చిస్తాం. ఎక్కడ లోపాలు జరిగాయి..? ఎందుకు జరిగాయో చర్చిస్తాం. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు మేమంతా నడుచుకుంటాం.