Independence Day Awards Telangana 2023 : తెలంగాణ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోట వద్ద జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ (CM KCR) పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సాంధించిన ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల కాలంలో సంభవించిన భారీ వరదలు(Floods), వర్షాల్లో ధైర్య సాహాసాలు ప్రదర్శించిన 14మంది అధికారులకు ప్రభుత్వం అవార్డులను అందించింది. సీఎం కేసీఆర్ వీరికి అవార్డులను ప్రధానం చేశారు.
అవార్డు గ్రహీతలు.. వారు చేసిన సేవలు:
- ములుగు జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు పాయం వీనయ్య ఏటూరునాగారం మండలం కొండాయ్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న పాఠశాల విద్యార్థులను రక్షించారు.
- జనగాం జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ లైన్ మెన్ ఎండీ రెహమాన్ విద్యుత్ పునరుద్ధరణలో విశేష సేవలు అందించారు.
- ములుగు జిల్లాకు చెందిన పంచాయతీకార్యదర్శి సంజీవ్ రావు ముత్యాల ధార జలపాతంలో చిక్కుకున్న 80 మంది యాత్రికులను రక్షించడంలో గొప్ప సమన్వయం కనబరిచారు.
- ములుగు జిల్లా పరిషత్ సీఈఓ ప్రసన్న రాణి కొండాయ్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న గర్భిణులను క్షేమంగా తరలించడంతో పాటు, వాయుమార్గం ద్వారా చేపట్టిన ఆహార పంపిణీని జాగ్రత్తగా పర్యవేక్షించారు.
- భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి ఆర్ఏఎస్పీ లత వరదల్లో చిక్కుకున్న జిల్లాలోని పలు గ్రామాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టారు.
- భూపాలపల్లి జిల్లాకు చెందిన రెవెన్యూ ఇన్ స్పెక్టర్ బి.ప్రదీప్ కుమార్ వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షిచేందుకు బోట్లు,హెలికాప్టర్ సేవలనుసమర్థంగా వినియోగించి వంద మందికి పైగా ప్రజలను రక్షించి, పునరావాస కేంద్రాలకు (Rehabilitation centers) తరలించారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వి. వెంకటేశ్వర్లు వరదల్లో చిక్కుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి రక్షణ, పునరావాస చర్యలు చేపట్టారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండల పంచాయతీ అధికారి ముత్యాల రావు వరదల్లో చిక్కుకున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను రక్షించడంలో గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారు.
- భూపాలపల్లి జిల్లాకు చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ రామనరసింహారెడ్డి వరదల్లో చిక్కుకున్న ప్రజలను తరలించడంతో పాటు తప్పిపోయిన నలుగురు వ్యక్తులను రక్షించారు.
- మరో మూడు మృతదేహాలను గుర్తించారు. భూపాలపల్లి జిల్లా కొయ్యురు ఎస్సై వి.నరేష్ మానేరు నది వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను రక్షించారు.
- వరంగల్ జిల్లా మట్వాడ ఏఎస్ఐ కె.సంపత్ తన బృందంతో వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 880 మంది ప్రజలను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- ములుగు జిల్లాకు చెందిన ఏఎస్సై జి.రాంబాబు మేడారంలో వరదల్లో చిక్కుకున్న 19 మందిని తన బృందంతో రక్షించారు.
- ములుగు జిల్లాకు చెందిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్ట్ కాన్ స్టేబుల్ కె. శ్రీకాంత్ మేడారం వరదల్లో (Medaram Floods) చిక్కుకున్న 19 మందిని తన బృందంతో కలిసి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
- సచివాలయ ఎన్ఆర్ఐ విభాగం ఏఎస్ఓ ఏడిగ చిట్టిబాబు.. ఉక్రెయిన్, సూడాన్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను స్వరాష్ట్రానికి తరలించడంలో చురుకైన పాత్ర పోషించారు.