Innohub Tech Cheating: మాదాపూర్ పీఎస్ పరిధిలో బ్యాక్‌డోర్ ఉద్యోగాల పేరుతో మోసపోయిన కేసులో బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇన్నోహబ్ టెక్నాలజీ ప్రై.లిపై మరో 20మంది బాధితుల ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 80 మందికి పైగా బాధితులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఫిర్యాదులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్లో సంస్థకు చెందిన రాహుల్ అకోలేతో పాటు మరో మహిళ కమలేశ్ కుమారిని నిందితులుగా చేర్చారు.
ఈ నేపథ్యంలో బాధితులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన 2వేల మందిని ఇన్నోహబ్ సంస్థ రిక్రూట్ చేసుకుందని బాధితులు చెబుతున్నారు. బాధితుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారన్నారు. అయితే ఇప్పటి వరకూ సంస్థ ప్రతినిధులు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. బ్యాక్‌డోర్‌లో ఉద్యోగం ఇస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. 1.5 నుంచి 2లక్షల వరకు వసూలు చేసిన సంస్థ... రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి బోర్డు తిప్పేసింది. దీంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు.
మేమే కాదు మా లాగా 2వేల మంది మోసపోయారు. ప్రతి ఒక్కరం రూ. 2 లక్షలు కట్టాం. ఈ స్కామ్‌లో దాదాపు 15 మంది దాకా ప్రమేయం ఉంది. ఒక సంవత్సరం నుంచే వీరు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇదంతా చేశారు. కంపెనీ మెయిల్స్, వ్యక్తిగత మెయిల్స్ బ్లాక్ చేశారు. మాకు అనుమానం వచ్చి కంపెనీ వద్దకు వచ్చి చూస్తే అసలు ఇక్కడ కంపెనీనే లేదు. కన్సల్టెంట్ మెంబర్ ద్వారా దాదాపు 500 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఉద్యోగంలో చేరినా కూడా ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. -- బాధితులు