తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాల్లో భూములకు పెరిగిన డిమాండ్‌

పల్లెకు పరపతి పెరిగింది.. భూమి.. బంగారంతో పోటీపడుతోంది.. ఒకప్పుడు ఎందుకూ కొరగావనుకున్నవి కూడా రూ.లక్షలు పలుకుతున్నాయి. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల కింద కొత్తగా సాగునీరు రావడం వల్ల చాలా ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. భూగర్భ జలాలు పెరిగి బోర్ల కిందా బాగా సాగవుతున్నందున డిమాండ్‌ పెరుగుతోంది. దీనికితోడు ప్రభుత్వం రైతుబంధు వంటి పలు పథకాలతో వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లాంటి చర్యలు మరిన్ని వర్గాలను సాగువైపు ఆకర్షిస్తున్నాయి. ఎంతో కొంత వ్యవసాయ భూమికి యజమానులయ్యేందుకు కొందరు పల్లెలవైపు చూస్తున్నారు.

గ్రామాల్లో భూములకు పెరిగిన డిమాండ్‌
గ్రామాల్లో భూములకు పెరిగిన డిమాండ్‌

By

Published : Aug 26, 2020, 6:30 AM IST

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలో ఐదేళ్ల క్రితం పొలం అమ్ముదామంటే కొనేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఎకరా పట్టా పెట్టుకుని రూ.20 వేలు అప్పు ఇవ్వమని అడిగినా.. ప్రైవేటు వ్యాపారులు కుదరదనేవారు. ఎకరా రూ.లక్ష - రూ.రెండు లక్షలకు పోవడం కనాకష్టంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. అదే భూమి ఎకరా ధర ఏకంగా రూ.11 లక్షలకు చేరింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీళ్లు పారుతుండటం వల్ల కోడేరు మండల ముఖచిత్రమే మారిపోయింది. మండలవ్యాప్తంగా మూడేళ్ల క్రితం 5,500 ఎకరాలు సాగులో ఉండగా.. ఇప్పుడు 22 వేల ఎకరాలు పచ్చగా కళకళలాడుతున్నాయి.

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలో ఐదేళ్ల క్రితం ఎకరా సాగు భూమి ధర రూ.5 లక్షలే. బోరు బావుల కింద ఒక్క పంట పండటం కష్టంగా ఉండేది. కాళేశ్వరం ద్వారా చెరువులు నింపడంతో ఇప్పుడు రెండు పంటలూ పండుతున్నాయి. దీంతో ఎకరా రూ.15 లక్షలు పలుకుతోంది.

ఒక్క కోడేరు, గంగాధర ప్రాంతాలే కాదు.. రాష్ట్రంలోని చాలా చోట్ల పల్లెల పరపతి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో ఎకరా ధర రూ.10 లక్షలకు తక్కువేమీ లేదంటే అతిశయోక్తి కాదు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, వ్యాపార వర్గాల వారు భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ధరల పెరుగుదల భారీగా ఉంది. ఇక సాగునీటి సౌలత్‌ ఉన్న నల్గొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ధరల విషయం చెప్పాల్సిన అవసరమేలేదు. మొత్తంమీద పదేళ్ల కాలంతో పోల్చితే ధరల్లో భారీగా మార్పు వచ్చింది.

జిల్లాల్లో రూ.లక్షల్లో ధరలు

* ఆరేళ్ల క్రితం తనకున్న ఎకరా భూమిని రూ.6 లక్షలకు విక్రయిద్దామని అనుకున్నారు మహబూబాబాద్‌కు చెందిన రమణయ్య. పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆ భూమిని ఇటీవల డబ్బు అవసరం వచ్చి అమ్మగా ఎకరా రూ.17 లక్షలు పలికింది. ఇదే పరిస్థితి చాలా మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల్లో కనిపిస్తోంది.

* మహబూబాబాద్‌కు ఇరవై కిలోమీటర్ల దూరంలోని బయ్యారం శివారులో పదేళ్ల క్రితం రూ.4 లక్షలు పలికిన ఎకరా భూమి ఇప్పుడు రూ.50 లక్షలు అయింది. ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలంలో ఎకరా భూమి ధర రూ.25 లక్షలు పలుకుతోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట, అమ్రాబాద్‌ లాంటి వెనుకబడిన మండలాల్లోనూ ఎకరా ధర రూ. 10 లక్షలకు తక్కువేమీ లేదు.

కాల్వల కింద అమ్మేవారే కరవు

ప్రాజెక్టులు, కాల్వల కింద భూమి ఉన్నవారిలో కొండంత ధైర్యం కనిపిస్తోంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరించి ఉన్న కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భూమి అమ్మేవారి సంఖ్య తగ్గిపోయింది. కాల్వల కింద నీళ్లు అందే మెదక్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనూ భూములకు డిమాండ్‌ పెరిగింది. ఈ ప్రాంతాల్లో ఎకరా భూమి ధర తక్కువలో తక్కువ రూ.30 లక్షలకుపై మాటే.

అందరిచూపూ భూమివైపే...

ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు కూడా తమకు ఎంతో కొంత సాగు భూమి ఉండాలని కోరుకుంటున్నారు. పల్లెలు, మండలాల శివార్లలో తక్కువలో తక్కువ పది గుంటల స్థలం ఉన్నా కొంటున్నారు. దీనికితోడు పెద్ద గ్రామాలు, మండలాలు, పట్టణాల శివారు భూముల్లో స్థిరాస్తి వ్యాపారం పెరుగుతుండటంతో ధరలకు రెక్కలు వస్తున్నాయి. పదేళ్ల కాలంలో రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, మండలాల శివారుల్లోని 11 లక్షల ఎకరాలు వ్యవసాయేతర భూములుగా మారాయి.

పరపతి పెరిగింది

ఎంత భూమి ఉన్నా పంట పండనప్పుడు దానికి విలువ ఉండదు. నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. ఐదేళ్ల క్రితం ఎకరం మాత్రమే సాగుచేసే వాడిని. ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేసింది. సాగునీరు వస్తోంది. దీంతో ఆరెకరాల్లో పంట పండిస్తున్నా. భూముల ధరలూ పెరిగాయి. రైతులకు పరపతి పెరిగింది.

- చంద్రయ్య, రైతు, కోడేరు, నాగర్‌కర్నూల్‌ జిల్లా

కొనేవారు పెరగడం వల్ల ధరలు పెరిగాయి

భూములపై ఎక్కువ మంది పెట్టుబడి పెడుతున్నారు. దీనికితోడు పంట పండుతుందన్న నమ్మకం పెరగడంతో ధరలు పెరిగాయి. ఎకరా భూమి ఉన్న రైతు కూడా లక్షాధికారే. ప్రాజెక్టుల నీళ్లు వస్తుండటంతో భరోసా పెరిగింది.

- బి.మల్లారెడ్డి, లక్ష్మీదేవిపల్లి, గంగాధర మండలం, కరీంనగర్‌ జిల్లా

ఇదీ చదవండి:ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!

ABOUT THE AUTHOR

...view details