తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజల అత్యాశపైనే నేరస్థులు గురి పెట్టి.. కోట్లు కొల్లగొడుతున్నారు. సైబర్ నేరాలంటే నైజీరియన్ మోసగాళ్ల పనే అనేది ఒకప్పటి మాట. అంతర్రాష్ట్ర ముఠాలు తెలుగు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం విడుదలైన జాతీయ నేర గణాంక సంస్థ-2018 నివేదిక ఇందుకు అద్దం పడుతోంది. సైబర్ మోసగాళ్ల బారిన పడుతున్న రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల అయిదారు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఈజీగా మోసపోతున్న తెలుగు ప్రజలు
సైబర్ నేరాల దర్యాప్తులో భాగంగా కొంతకాలం క్రితం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దిల్లీ నుంచి ఇద్దరు నైజీరియన్ నేరస్థులను పట్టుకొచ్చారు. వారి వద్ద నుంచి జప్తు చేసిన ల్యాప్ టాప్లో హైదరాబాద్కు చెందిన వేలాది ఫోన్ నంబర్లున్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. వాటిపై ఆరా తీస్తే నేరస్థుల నుంచి ఆశ్చర్యకరమైన సమాధానం లభించింది. తెలుగు ప్రజలైతే సులభంగా మోసపోతారని నిందితులు చెప్పారు. అత్యాశకు పోతారు... కాబట్టి ఎక్కువగా వలేస్తున్నట్లు వెల్లడించారు.
గాలమేస్తున్న దేశవాళీ సైబర్ నేరగాళ్లు...
గతంలో కేవలం నైజీరియన్ నేరస్థులే సైబర్ మోసాలకు పాల్పడే వారు. ఈ ఆనవాయితీని పక్కనపెట్టి తెలుగు రాష్ట్రాలపై ఉత్తరాది మోసగాళ్లు పంజా విసరడం సర్వసాధారణంగా మారడం వల్ల ఇలాంటి తరహా కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజల అత్యాశ ఎలా ఉందంటే లాటరీ టికెట్ కొనకుండానే లాటరీ గెలిచామని ఫోన్ చేసే సైబర్ మోసగాళ్లకు ఉన్నదంతా ఊడ్చి పెట్టేస్తున్నారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున బహుమతుల్ని పంపిస్తున్నామంటే అప్పు చేసి మరీ సమర్పించేస్తున్నారు. అతి తక్కువ ధరకే పాత వాహనాల్ని అమ్ముతామంటే నమ్మి ఆన్లైన్లోనే లక్షలు బదిలీ చేసుకున్న ఉదంతమే ఇందుకో ఉదాహరణ. ఓ విశ్రాంత ఉద్యోగికి ఓ మోసగాడు ఫోన్ చేసి 2,500 కోట్ల లాటరీ గెలిచావని చెబితే సులభంగా నమ్మేశాడు. దాదాపు రెండేళ్లపాటు 70లక్షల వరకు సమర్పిస్తూ పోయాడు.
ఏటికేడు రెట్టింపవుతున్న నేరాలు
దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాలు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. మూడేళ్ల కాలంలోనే రెట్టింపుకన్నా అధికంగా కేసులు నమోదయ్యాయి. 2016లో మొత్తంగా 12, 317 కేసులు నమోదు కాగా... 2017కు వచ్చేసరికి కేసుల సంఖ్య ఏకంగా 21,593కి చేరుకుంది. 2018లో మరింత పెరిగి 27,004 నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. 2019లో ఒక్క తెలంగాణ రాజధానిలోనే ఏకంగా 2200లకు పైగా కేసులు నమోదు కావడాన్ని బట్టే సైబర్ నేరస్థులు ఏలా గాలమేస్తున్నారో తెలిసిపోతోంది.