ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తున్నా.. సైబర్ నేరగాళ్లు విశ్రమించట్లేదు. రోజుకో మాయతో అమాయక ప్రజల్ని దోచుకుంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో.. ఉచితంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఇస్తామంటూ.. ప్రజలను గాలం వేస్తున్నారు. తాము నిర్వహించే సర్వేలో పాల్గొంటే చాలంటూ.. ఇటీవల అనేక మంది అంతర్జాల వినియోగదారులను మోసం చేసి డబ్బులు లాగారు. ఈ తరహా మోసంతో... బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
షేర్ చేయండి@మోసం..
మరో రకం సైబర్ మోసంలో... కేవలం పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, ఆ సమాచారాన్ని పది మంది వాట్సాప్ వినియోగదారులకు పంపాలని షరతు విధించారు. ఇది నమ్మి అనేకమంది ఆ సర్వేని పూర్తి చేసి తమ వాట్సాప్ మిత్రబృందంలో పది మందికి పంపారు. ఆ పది మంది లింక్ తెరవగానే వారి చరవాణిలో ఉన్న వ్యక్తిగత సమాచారం నేరగాళ్లకు చేరిపోయింది.
6,500 చెల్లిస్తే చాలు..
కరోనానూ సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మలుచుకుంటున్నారు. శానిటైజర్లతో పాటు మాస్క్‌ల కొరతను అవకాశంగా మలచుకుని... తమ వద్ద పేరొందిన సంస్థల శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 6,500 చెల్లిస్తే చాలు... ఇంటిల్లిపాదికి ఉపయోగపడే కిట్ పంపిస్తామని అంతర్జాలంలో ప్రచారం చేశారు. ఈ మాటలను నమ్మి అనేక మంది డబ్బులు చెల్లించారు. ఎన్నిరోజులు ఎదురు చూసినా కిట్ రాకపోగా.. మోసపోయినట్టు గుర్తించారు.