Respiratory diseases Increase: రాష్ట్రంలో శ్వాస సంబంధిత సమస్యలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం, చల్లని గాలుల తీవ్రత పెరగడం, కాలుష్యం అధికమవడంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్న బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. చలికాలంలో విషతుల్య రసాయనాలు కూడా గాలిలో ఉండిపోతుండడంతో.. జలుబు, గొంతునొప్పి, సైనసైటిస్, న్యుమోనియా, ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సీవోపీడీ) తదితర శ్వాస కోశ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ నెల(అక్టోబరు)లో గడిచిన 25 రోజుల్లోనే 35,221 మంది అత్యవసర శ్వాస సమస్యలతో చికిత్స పొందగా.. గడిచిన 7 వారాల్లో వీరి సంఖ్య 83,195గా నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 9,60,908 మంది శ్వాస సమస్యలతో బాధపడినట్లుగా ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 1,85,979 మంది అత్యవసర శ్వాస సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఈ గణాంకాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రులకు చెందినవి. ప్రైవేటు ఆసుపత్రుల్లో శ్వాసకోశ సమస్యలతో చికిత్స పొందినవారి గణాంకాలు కూడా జత చేస్తే.. బాధితుల సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉంటుందని వైద్యులు అంచనా. బాధితుల్లో పిల్లలే అత్యధికం. కొంతమందిలో జలుబు తగ్గిపోయినా దగ్గు, గొంతునొప్పి వంటివి వారం రోజులు గడిచినా వేధిస్తూనే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
స్వీయ జాగ్రత్తలు మేలు..
- తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు, నోటికి ఆచ్ఛాదన ఉండాలి.
- తుమ్మిన, దగ్గిన అనంతరం ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
- జలుబు ఉన్నవారు ఇంట్లో ఒక గదిలో విశ్రాంతి తీసుకోవడమే మేలు.
- ఈ సమస్యలతో బాధపడుతున్నప్పుడు పిల్లల్ని పాఠశాలకు పంపించొద్దు.
- వీరు వాడే చేతి రుమాలు, టవల్ వంటి వాటిని ఇతరులు వాడొద్దు.
- గొంతునొప్పికి వైద్యులు సూచించిన మేరకు పూర్తి స్థాయి ఔషధాలను వాడాలి.
- వేడి నీటితో ఆవిరిపట్టాలి.
- చలికాలంలో బయటికెళ్లినప్పుడు ముక్కు, నోటికి ఆచ్ఛాదన ధరించాలి.
- చల్లని పదార్థాలు, చల్లని నీళ్లు, ఫ్రిడ్జ్‌లో పెట్టిన పదార్థాలు తినకూడదు.
- తాజా ఆహారాన్నే తీసుకోవాలి.
- 48-72 గంటల వ్యవధిలో లక్షణాలు తగ్గుముఖం పట్టకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.