తెలంగాణ

telangana

ETV Bharat / state

NEW CHARGES FROM TODAY: నేటి నుంచే కొత్త రుసుములు.. ఆస్తుల విలువ పెంపు! - increased registrations charges will come into effect from today

రాష్ట్రంలో పెరిగిన భూముల విలువ, రిజిస్ట్రేషన్​ ఛార్జీలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేసింది. వ్యవసాయ భూములకు సంబంధించి తహసీల్దారు, సంయుక్త సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ కొనసాగుతుండగా.. వ్యవసాయేతర భూములకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖ వెబ్​సైట్​లో వివరాలు అందుబాటులోకి తెచ్చారు.

NEW CHARGES FROM TODAY
తెలంగాణలో పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు

By

Published : Jul 22, 2021, 10:29 AM IST

Updated : Jul 22, 2021, 10:37 AM IST

రాష్ట్రంలో పెరిగిన భూముల విలువ, కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీల అమలుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గురువారం నుంచి పెరిగిన విలువలు, ఛార్జీల ప్రాతిపదికగా రిజిస్ట్రేషన్లు చేసేలా ‘కార్డ్‌’ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. కొత్త విధానం అమలుపై ఉన్నతాధికారులు సమీక్షించారు. మొదటి రోజు నుంచీ ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సబ్‌రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఇప్పటికే ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు అదనపు మొత్తం చెల్లించేందుకు ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర భూములు, స్థలాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ల కొత్త విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో మార్పులను బుధవారం రాత్రి ఏడుగంటలకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఆస్తుల విక్రయానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ ఛార్జీ 7.5 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీల పరిధిలో ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ లేకున్నా స్టాంపు డ్యూటీ 5.5 శాతం, రిజిస్ట్రేషన్‌ ఫీజు 2 శాతం అమలు కానున్నాయి. పంచాయతీయేతర ప్రాంతాల్లో 5.5 శాతం స్టాంపు డ్యూటీ, 1.5 శాతం ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, 0.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు వసూలు చేస్తారు.

‘ధరణి’ పోర్టల్లోనూ సవరణలు

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు గురువారం నుంచి తహసీల్దారు- సంయుక్త సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే స్లాటు నమోదు చేసుకున్న వారు వారి సర్వే నంబరును బట్టి పెరిగిన మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి వారు సుమారు 30,891 మంది ఉన్నట్లు గుర్తించారు. అదనపు ఫీజు చెల్లింపుల కోసం ‘ధరణి’ పోర్టల్లో ప్రత్యేక ఐచ్ఛికాన్ని (టీఎం1ఏ) రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసింది.

వ్యవసాయ భూముల కనిష్ఠ మార్కెట్​ విలువ ఎకరాకు రూ.75 వేల రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం.. స్లాబుల వారీగా 50, 40, 30 శాతం లెక్కన 3 స్లాబుల్లో వ్యవసాయ భూముల మార్కెట్​ విలువలను పెంచింది. అదే విధంగా ఓపెన్​ ఫ్లాట్ల చదరపు గజం కనీస ధర 100 నుంచి 200 రూపాయలకు పెంచిన ప్రభుత్వం.. స్లాబుల వారీగా తక్కువ ధర కలిగిన వాటిపై 50 శాతం.. మధ్య రకం విలువలు కలిగిన వాటిపై 40 శాతం, ఎక్కువ విలువలు కలిగిన వాటిపై 30 శాతం లెక్కన 3 స్లాబుల్లో పెంచింది.

ఒక్క బటన్​ నొక్కగానే.. విలువలు అప్డేట్..

అపార్ట్​మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు.. కనీస విలువ 800 నుంచి వెయ్యి రూపాయలకి పెంచిన ప్రభుత్వం.. చదరపు అడుగుపై 20, 30 శాతం లెక్కన రెండు స్లాబులు పెంచింది. ప్రాంతాల వారీగా, గ్రామాలు, పట్టణాలు వారీగా పెంచిన మార్కెట్​ విలువలు.. ఇప్పటికే అప్డేట్ అయ్యాయి. పెంపునకు సంబంధించి సాఫ్ట్​వేర్​ ముందే సిద్ధం చేసి పెట్టుకోవడంతో ఒక్క బటన్​ నొక్కగానే ఆటోమెటిక్​గా విలువలు అప్డేట్ అయ్యాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:power sector Privatization : కేంద్ర సవరణ ప్రతిపాదనలన్నీ ప్రైవేటీకరణ దిశగానే

Last Updated : Jul 22, 2021, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details