తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా సంక్షోభంతో... పెరిగిన మెట్రో ప్రాజెక్టు వ్యయం - కరోనా తాజా వార్తలు

హైదరాబాద్‌ మెట్రో నిర్మాణానికి భారీ ఎత్తున పెట్టుబడి పెట్టడం, వాటిపై వడ్డీలు చెల్లిస్తుండటంతో రూ.382 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని 2019-20 వార్షిక ఆర్థిక ఫలితాల్లో ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో వెల్లడించింది. మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌తో మెట్రో రైలు సేవలు నిల్చిపోయినందున, ఆ ప్రభావం, భవిష్యత్తులో కంపెనీ ఆర్థిక పరిస్థితిని ఇప్పటికిప్పుడు అంచనా వేయడంలేదని పేర్కొంది. ప్రభుత్వ ఒప్పందంలోని నిబంధనల ఆధారంగా సంస్థ ప్రయోజనాలను పరిరక్షించుకుంటామని తెలిపింది.

Increased metro project cost with corona crisis in hyderabad
కరోనా సంక్షోభంతో... పెరిగిన మెట్రో ప్రాజెక్టు వ్యయం

By

Published : Aug 10, 2020, 8:12 AM IST

Updated : Aug 10, 2020, 4:54 PM IST

హైదరాబాద్‌ మెట్రో తొలి దశ పాతబస్తీ మినహా 69.2 కి.మీ. మార్గం గత ఆర్థిక సంవత్సరంలో పూర్తయింది. కారిడార్‌-1 మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌(29.55 కి.మీ.), కారిడార్‌-2 జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌(10.65 కి.మీ.), కారిడార్‌-3 నాగోల్‌ నుంచి రాయదుర్గం(29 కి.మీ.) మార్గాలను 2017 నవంబరు 29 నుంచి 2020 ఫిబ్రవరి 8 మధ్య దశలవారీగా ప్రారంభించారు. రవాణా ఆధారిత అభివృద్ధి(టీవోడీ)లో భాగంగా నాలుగు ప్రాంతాల్లో పంజాగుట్ట, ఎర్రమంజిల్‌, హైటెక్‌సిటీ, మూసారాంబాగ్‌లో 12.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు వాణిజ్య సముదాయాలను నిర్మించింది. రాయదుర్గంలో 5 లక్షల చ.అ. విస్తీర్ణంలో కార్యాలయ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌అండ్‌టీ మెట్రో రూ.1626 కోట్లు వ్యయం చేసింది.

లాక్‌డౌన్‌తో మరింత నష్టాలు..

గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.600 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.వెయ్యి కోట్లు వస్తుందన్న అంచనాలు మొదట్లో ఉండేవి. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 4 లక్షలు దాటి 5 లక్షల దిశగా ఉన్న దశలో కొవిడ్‌-19 పిడుగులా వచ్చి పడింది. సేవలు మార్చి 22 నుంచి నిలిచాయి. 5 నెలలుగా ఆదాయం లేదు. కొవిడ్‌కు ముందు నెల వరకు రూ.50 కోట్ల ఆదాయంతో లాభనష్టాలు లేని దశకు చేరుకుంది. మెట్రోరైళ్లు, స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది జీతాల వరకు ఇబ్బంది లేకుండా గడిచిపోయేది. కరోనాతో అధికారుల అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

రూ.3756 కోట్లకు పెరిగిన ప్రాజెక్టు వ్యయం

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలోని హైదరాబాద్‌ మెట్రోపై ఇప్పటివరకు రూ.21,919 కోట్లపైన వ్యయం చేశారు. ఇందులో అత్యధిక భాగం ఎల్‌అండ్‌టీ మెట్రోదే. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, ఇతరత్రా అవసరాలకు రూ.3వేల కోట్లు, కేంద్ర సర్దుబాటు వ్యయ నిధి రూ.1458 కోట్లు మినహా మిగతా మొత్తం ఎల్‌అండ్‌టీ మెట్రోనే భరించింది. 2017 జులై నాటికే ప్రాజెక్ట్‌ పూర్తికావాల్సి ఉండగా వేర్వేరు కారణాలతో పనులు పూర్తికాకపోవడంతో ప్రభుత్వం తుది గడువును మూడుసార్లు పొడిగించింది. జూన్‌ 30, 2020తో ఈ గడువు ముగిసింది. తొలిదశ పూర్తికావడంతో ప్రాజెక్ట్‌ వ్యయం వివరాలను ఎల్‌అండ్‌టీ మెట్రో ప్రభుత్వానికి సమర్పించింది. ఆలస్యంతో ప్రాజెక్ట్‌ వ్యయం రూ.3756 కోట్లకు పెరిగిందని.. ఈ భారం నుంచి ఉపశమనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఇదీ చదవండి:కాంగ్రెస్​ వర్గీయుల బాహాబాహీ.. ఒకరిపై ఒకరి కేసులు

Last Updated : Aug 10, 2020, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details