కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి ఎగువ నుంచి మళ్లీ ప్రవాహం ప్రారంభమైంది. ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలకు 30 వేలకుపైగా క్యూసెక్కులు వస్తుండటంతో అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. జూరాల వద్ద ఇప్పటికే 63 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం వైపు 64 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తంగా శ్రీశైలానికి 84 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. పులిచింతలకు 11 వేల క్యూసెక్కులు వస్తుండగా.. ప్రకాశం బ్యారేజీ వైపు 19 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు 5,669 క్యూసెక్కులు వస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 99 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
మొదటి ప్రమాద హెచ్చరిక
గోదావరి పరీవాహకంలో సింగూరు ప్రాజెక్టుకు 34 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. నిజాంసాగర్‌కు 44,600 క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు 54 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీరామసాగర్‌కు 2.60 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దిగువకు 2.57 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి వద్ద ఇన్‌ఫ్లో 5.54 లక్షల క్యూసెక్కులుంది. దిగువకు 5.40 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్టకు 4.80 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడి నుంచి సముద్రానికి 4.76 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో మట్టం గురువారం తెల్లవారుజామున 3.35 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సాయంత్రం 6 గంటలకు 46.8 అడుగులకు చేరుకుంది.
కృష్ణా, గోదావరి నదులతోపాటు ఉప నదులకు వస్తున్న భారీ వరదను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన పరిస్థితిని ఆన్‌లైన్‌లో సమీక్షించారు. సింగూరు, నిజాంసాగర్‌లతోపాటు ఎస్సారెస్పీ, జూరాల తదితర ప్రాజెక్టులకు వరద గురించి సీఈలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జల సంఘానికి సమర్పించాల్సిన ప్రాజెక్టుల డీపీఆర్‌ల రూపకల్పనపైనా సూచనలు చేశారు. ఈఎన్‌సీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.