రాష్ట్రంలో విద్యుత్తు వాహనాల వినియోగం భారీగా (Increased Electric Vehicles in Telangana) పెరిగింది. గతేడాది అక్టోబరు 30న రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన నిల్వ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఆ వాహనాల క్రయవిక్రయాల్లో మునుపెన్నడూ లేని పురోగతి కనిపించింది. ఏడాది వ్యవధిలోనే తెలంగాణలో 5000కి పైగా నాలుగు, మూడు, రెండు చక్రాల విద్యుత్ వాహనాల కొనుగోళ్లు జరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్(ఈ) వాహనాల తయారీ రంగంలో తెలంగాణను దేశీయ కేంద్రం (హబ్)గా తీర్చిదిద్దేందుకు, ఇంధన నిల్వ, విడిభాగాల ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల (2020-30) కాలానికి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా.. మొదటగా కొనుగోలు చేసే కొన్ని విద్యుత్ వాహనాలకు వంద శాతం రిజిస్ట్రేషన్ రుసుం, రోడ్డు పన్ను మినహాయింపు వంటి రాయితీలను ప్రకటించింది. ఇవి తొలి 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 20 వేల ఆటోలు, 5 వేల నాలుగు చక్రాల వాణిజ్య వాహనాలు(కార్లు, టాక్సీ, టూరిస్టు క్యాబ్‌లు), 10 వేల తేలికపాటి (లైట్) గూడ్స్ వాహనాలు, 5 వేల కార్లు, 500 బస్సులకు వర్తిస్తాయి. కరోనా ప్రభావం వల్ల తొలుత అమ్మకాలు మందకొడిగా సాగినా... ఆ తరవాత పుంజుకున్నాయి. రాయితీలు, ప్రోత్సాహకాల వల్ల వినియోగదారుల్లో చైతన్యం వచ్చింది. మరోవైపు ఇంధన ధరలు పెరుగుతుండటంతో ఎక్కువ మంది ఈ-వాహనాల వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. నాలుగు, మూడు చక్రాల వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకు ఆదరణ లభిస్తోందని అమ్మకందారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 70 ఛార్జింగ్ కేంద్రాలు ఉన్నాయి. వచ్చే జూన్ నాటికి మరో 138 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా.. భవిష్యత్తులో ఈ-వాహనాల వినియోగం విస్తృతమయ్యే అవకాశముంది.
దేశంలో 8వ స్థానం
హైదరాబాద్ మహా నగరంతో పాటు వరంగల్, కరీంనగర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకూ విద్యుత్ వాహనాలు విస్తరించాయి. ఫలితంగా వీటి వినియోగంలో దేశంలో తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం గత జూన్ నాటి వరకు ఉన్న విద్యుత్ వాహనాల సంఖ్యను పరిగణనలోనికి తీసుకొని ర్యాంకులను ప్రకటించింది. అందులో.. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానం తెలంగాణ రాష్ట్రానిదే. ఈ సంవత్సరాంతానికి రాష్ట్రం మొదటి అయిదు స్థానాల్లోకి వచ్చే అవకాశముందని అంచనా.