యాసంగిలో పెరిగిన సాగు... గణాంకాలు వెల్లడించిన వ్యవసాయ శాఖ రాష్ట్రంలో యాసంగి పంటల సాగు శరవేగంగా సాగుతోంది. ఈ సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 36 లక్షల 93 వేల 16 ఎకరాలు నిర్దేశించగా... ఇప్పటివరకు 32 లక్షల 92 వేల 478 ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగు పూర్తైంది. దాదాపు 89 శాతం పూర్తైనట్లు వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గత ఏడాది ఇదే సమయానికి 27.40 లక్షల ఎకరాల విస్తీర్ణం మేర పూర్తైంది. ఈ ఏడాది నీటి వనరులు అందుబాటులో ఉండటం, వర్షాలు సమృద్ధిగా పడటం వల్ల సాగు విస్తీర్ణం పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.
రైతుల మొగ్గు...
యాసంగిలో ఎక్కువగా వరి సాగు చేయటానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. 22 లక్షల 19 వేల 326 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు లక్ష్యం పెట్టుకోగా.. 23 లక్షల 47 వేల 917 ఎకరాల్లో నాట్లు వేశారు. వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న పంట నిరుత్సాహపరిచింది.
ఇది దృష్టిలో పెట్టుకుని యాసంగిలో ప్రోత్సహిస్తూ 4 లక్షల 4 వేల 860 ఎకరాలు నిర్దేశించారు. ఇందులో 60 శాతం వరకు సాగు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. వేరుశనగ సైతం ఆశాజనకంగా ఉన్నట్లు వివరించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
తెలంగాణ సిరి...
రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగం అధికంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఆగ్రోస్ ద్వారా "తెలంగాణ సిరి" పేరుతో సరఫరా చేస్తున్న సేంద్రీయ ఎరువులు వాడాలని చెప్పింది. దీనివల్ల రసాయన అవశేషాల్లేని పంట ఉత్పత్తులు పొందవచ్చని వెల్లడించింది. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులకు ప్రత్యామ్నాయంగా సహజ, ప్రకృతి సేద్యం పద్ధతులు అవలంభించాలని సూచించింది.