లోటును పూడ్చేందుకే.. కరెంటు ఛార్జీలు పెంపు.? వ్యవసాయానికి రోజంతా నిరంతర విద్యుత్ ఇవ్వడం వల్ల పంట దిగుబడి పెరిగిందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. సాగుతో పాటు కాళేశ్వరం సహా ఇతర ఎత్తిపోతల పథకాల్లో మోటార్ల వినియోగం వల్ల కరెంటు డిమాండు రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నమోదైందని పేర్కొన్నారు. అయినా ఎక్కడా కోతలు లేకుండా నిరంతర సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. గత మూడు రోజులుగా విద్యుత్ డిమాండు విపరీతంగా పెరుగుతుండటంతో సరఫరాకు చేస్తున్న ఏర్పాట్లు, ఈ నెలాఖరులో కరెంటు ఛార్జీల పెంపుపై సమర్పించే నివేదిక, వినియోగదారుల సమస్యలు తదితర అంశాలపై ఆయన ‘ఈనాడు-ఈటీవీ భారత్’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
డిమాండుకు తగ్గట్లుగా సరఫరాకు ఏం చర్యలు చేపట్టారు?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు నిత్యం ఆరేడు గంటలే సాగుకు విద్యుత్‌ను ఇచ్చేవారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలుత 7 నుంచి 9 గంటలకు.. ఆ తర్వాత రోజంతా నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం. విద్యుత్ పంపిణీ వ్యవస్థ మెరుగుకు గత ఐదేళ్లలో రూ.26 వేల కోట్లు వ్యయం చేశాం. కొత్తగా 832 సబ్‌స్టేషన్లు నిర్మించాం.
లోటును పూడ్చుకోవడానికి కరెంటు ఛార్జీలు పెంచబోతున్నారని ప్రచారం జరుగుతోంది కదా?
డిస్కం ఆదాయ, వ్యయాలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి ఈ నెలాఖరులో నివేదిక అందజేస్తాం. మండలి ఆడిట్ చేసి డిస్కంల ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఛార్జీల విషయంలో తీర్పు వెలువరిస్తుంది. దాని ప్రకారం ముందుకెళతాం.
డిస్కంల అంతర్గత ఆదాయం పెంచుకోకుండా ప్రజలపై భారం సబబేనా ?
గత నాలుగేళ్లుగా ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. పంపిణీ వ్యవస్థకు, కరెంటు కొనుగోలుకు భారీగా నిధులు వెచ్చిస్తున్నాం. అంతర్గత ఆదాయం పెంచుకోవడంవల్లనే నిధులుసమకూరుతున్నాయి.
సౌరవిద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి డిస్కంలకు అమ్మిన విద్యుత్‌కు నిధులు చెల్లించడం లేదు. ఎందుకు?
ఒక విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి కరెంటు కొన్న తరవాత సొమ్ము చెల్లించడానికి డిస్కంలకు 60 రోజుల వరకూ గడువు ఉంటుంది. ఆ నిబంధన మేరకు సంబంధిత కేంద్రాలకు దశలవారీగా డబ్బులు ఇస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే రాయితీల నిధులను ఎప్పటికిప్పుడు ఈ బకాయిలకు విడుదల చేస్తున్నాం.
క్షేత్రస్థాయిలోని విద్యుత్ సిబ్బంది అవినీతి నియంత్రణకు ఏం చేస్తున్నారు?
విద్యుత్ సిబ్బంది ఎక్కడ అవినీతికి పాల్పడినా, కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడినా ప్రజలు 1912 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫేస్‌బుక్, వాట్సప్, ట్విటర్ ద్వారా కూడా ఫిర్యాదులను పంపొచ్చు. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి చర్యలు తీసుకుంటున్నాం.
ఇళ్లపై సౌరవిద్యుత్ ఏర్పాటుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఎలా దరఖాస్తు చేయాలి?
ప్రజలెవరైనా టీఎస్‌ఎస్పీడీసీఎల్ లేదా ఎన్‌పీడీసీఎల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. వారందరికీ వెంటనే అనుమతి మంజూరు చేస్తాం. ఇంటిపై ఏర్పాటకయ్యే వ్యయంలో 40 శాతం కేంద్రం రాయితీగా ఇస్తోంది. సౌరవిద్యుత్ ఏర్పాటు వల్ల కరెంటు బిల్లు ఆదా అవుతుంది.
కరెంటు డిమాండు భారీగా పెరగడానికి కారణాలేంటీ
ప్రస్తుతం కాళేశ్వరం సహా ఇతర ఎత్తిపోతల పథకాల్లో మోటార్లను నిరంతరాయంగా నడుపుతున్నందున అదనంగా 2 వేల మెగావాట్ల వరకూ వినియోగమవుతోంది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో వ్యవసాయ బోర్లకు సైతం వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా బుధవారం 12,935 మెగావాట్ల డిమాండు నమోదైంది.
డిమాండుకు తగిన రీతిలో డిస్కంల ఆదాయం ఉండటం లేదు. ఆదాయ, వ్యయాల మధ్య లోటు ఎందుకు పెరుగుతోంది
గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో కరెంటు ఛార్జీలను పెంచలేదు. ప్రభుత్వమే రాయితీల రూపంలో నిధులు విడుదల చేస్తోంది. సేద్యానికి ఎంత విద్యుత్ అయినా ఇవ్వడానికీ నిధులను సమకూరుస్తోంది. ఎత్తిపోతల పథకాలకు కరెంటు బిల్లు అధికంగా వస్తున్నందున ఇటీవల రూ.500 కోట్లను విడుదల చేసింది. ఆదాయ, వ్యయాల మధ్య లోటు తీర్చడానికి సర్కారే నిధులు సమకూరుస్తున్నందున ప్రస్తుతానికి ఇబ్బందుల్లేవు.
ఆన్‌లైన్‌లో చెల్లించే కరెంటు బిల్లులు జమగాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని సరిచేయలేరా
సదరన్ డిస్కంలో నెలకు 18 లక్షల మంది ఆన్‌లైన్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. బిల్లులు జమకాలేదంటూ నెలకు సుమారు వంద వరకూ ఫిర్యాదులొస్తున్నాయి. వాటి పరిష్కారానికి ఐటీ విభాగం ఎప్పటికప్పుడు కృషి చేస్తోంది. వినియోగదారుల సొమ్ము ఎక్కడికీపోకుండా భద్రంగా వారి కనెక్షన్ ఖాతాలో ఉంటుంది. ఒకవేళ ఎక్కువ చెల్లించినా తదుపరి నెల బిల్లులో సర్దుబాటు చేస్తాం.
ఇవీ చూడండి:విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి