Vande Bharat Express Train From Secunderabad To Tirupati : సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటి ట్రిప్ బుధవారం నుంచి ప్రారంభమైంది. వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి 109 శాతం ప్రయాణికులతో బయలుదేరినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. గతంలో కంటే 15 నిమిషాల తక్కువ సమయంలో వందేభారత్ రైలు గమ్యస్థానానికి చేరుకున్నట్లు అధికారులు వివరించారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మళ్లీ సికింద్రాబాద్కు ప్రధాని రైలు ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ప్రయాణికుల నుంచి భారీ స్పందన వస్తోందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఈ రైలు రెండు వైపులా 130 శాతం కంటే ఎక్కువ ఓఆర్తో నడిచినట్లు రైల్వే అధికారులు వెల్లడించి.. హర్షం వ్యక్తం చేశారు. అయితే రైలు ప్రారంభించినప్పుడు 8 కోచ్లు మాత్రమే ఉండడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రయాణికుల నుంచి కోచ్లు పెంచాలని అభ్యర్థనలు, డిమాండ్లు రైల్వే శాఖకు వెల్లువెత్తాయి. దీంతో భారతీయ రైల్వే.. రైలులోని కోచ్ల సంఖ్యను 8 నుంచి 16కు రెట్టింపు సంఖ్యలో పెంచింది. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా మరో విశేషం ఏమిటంటే రైలులోని సీట్ల సామర్థ్యం కూడా 530 నుంచి ఏకంగా 1128కు పెంచారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్లో 104 సీట్లు.. చైర్ కార్లో మరో 1024 సీట్లు అదనంగా చేరారు.