తెలంగాణ

telangana

ETV Bharat / state

fees Increase: వృత్తి విద్యలో ఫీజుల పెంపు.. గరిష్ఠంగా ఎంతంటే..? - vocational education fees Increase

fees Increase: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ సహా ఇతర వృత్తి విద్యా కోర్సుల వార్షిక రుసుములు పెరగనున్నాయి. ఒక్కో విద్యార్థిపై కళాశాలలు చేసిన తలసరి వ్యయం ఆధారంగా గరిష్ఠంగా 25 శాతం పెంచనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ సంకేతాలు ఇచ్చింది.

fees Increase: వృత్తి విద్యలో ఫీజుల పెంపు.. గరిష్ఠంగా ఎంతంటే..?
fees Increase: వృత్తి విద్యలో ఫీజుల పెంపు.. గరిష్ఠంగా ఎంతంటే..?

By

Published : May 1, 2022, 7:20 AM IST

fees Increase: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ సహా ఇతర వృత్తి విద్యా కోర్సుల వార్షిక రుసుములు గరిష్ఠంగా 25 శాతం వరకు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. వచ్చే మూడు విద్యా సంవత్సరాల (2022-23, 23-24, 24-25) కోసం కొత్త ఫీజులు ఖరారు చేయాల్సి ఉన్న నేపథ్యంలో కమిటీ శనివారం కళాశాలల యాజమాన్యాలు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఒక్కో విద్యార్థిపై కళాశాలలు చేసిన తలసరి వ్యయం ఆధారంగా.. గరిష్ఠంగా 25 శాతం పెంచి రుసుములను నిర్ణయిస్తామని కమిటీ వర్గాలు యాజమాన్యాలకు తెలిపినట్లు తెలిసింది.

ఇందులో ద్రవ్యోల్బణం 10 శాతం, అభివృద్ధి ఖర్చును మరో 15 శాతం పరిగణనలోకి తీసుకుంటామని, 2019-20, 20-21 సంవత్సరాల్లో ఎప్పుడు ఎక్కువ వ్యయం ఉంటే దాన్ని లెక్కలోకి తీసుకుంటామని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తలసరి వ్యయం తక్కువగా ఉన్నప్పుడు మాత్రం పాత ఫీజునే కొనసాగిస్తామని చెప్పినట్టు తెలిసింది. అంటే ఒక కళాశాలలో వార్షిక ఫీజు రూ.లక్ష ఉందనుకుందాం. ఆ యాజమాన్యం ఒక్కో విద్యార్థిపై తలసరి ఖర్చు రూ.75 వేలుగా చూపితే, దానిపై 25 శాతం పెంచి రూ.93,750గా నిర్ధారించాలి. కానీ ఇలాంటి సందర్భాల్లో పాత ఫీజునే(రూ.లక్ష) కొనసాగిస్తారు. అంటే ఏ కళాశాలలోనూ వార్షిక రుసుములు తగ్గవన్న మాట.

బోధనేతర సిబ్బంది వేతనాలు 33% మించొద్దు:శ్రీకృష్ణ కమిటీ ప్రకారం కనీస రుసుం రూ.75 వేలుగా నిర్ధారించాలని కొందరు కోరగా.. కమిటీ అంగీకరించలేదు. ఏడో వేతన సంఘం ప్రకారం శ్రీకృష్ణ కమిటీ లెక్కలు వేసిందని, రాష్ట్రంలో ఆరో వేతన సంఘం అమలవుతున్నందున దానిని అమలు చేయలేమని సమాధానమిచ్చినట్టు సమాచారం. అలాగే చెల్లించే మొత్తం వేతనాల్లో బోధనేతర సిబ్బంది జీతాలు 33 శాతానికి మించకూడదని కూడా స్పష్టం చేసినట్టు తెలిపింది. మొత్తంగా మే నెలాఖరు లోపు కొత్త రుసుములను నిర్ధారిస్తామని, అంతకు ముందే ఒక్కో కళాశాల యాజమాన్యాన్ని పిలిచి అభ్యంతరాలు తెలుసుకుంటామని కమిటీ సభ్యులు సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి, కన్సల్టెంట్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details