తెలంగాణ

telangana

ETV Bharat / state

వంటనూనెల ధరలకు రెక్కలు... ఆయిల్​పామ్​ రైతులకు ఆమ్దానీ

దేశంలో వంట నూనెల ధరలకు రెక్కలు రావడంతో రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ రైతులకు కలిసి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టన్ను ఆయిల్‌ పామ్‌ గెలలకు రూ.12,800 చొప్పున ధర దక్కుతుండటంతో ఈ రైతులకు మంచి లాభాలొస్తున్నాయి.

By

Published : Dec 11, 2020, 7:57 AM IST

Income to oil palm farmers
వంటనూనెల ధరలకు రెక్కలు... ఆయిల్​పామ్​ రైతులకు ఆమ్దానీ

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పామాయిల్‌ ధర మండుతున్నందున దాని తయారీకి ఉపయోగించే ఆయిల్‌పామ్‌ పండ్ల గెలల ధర చుక్కలనంటుతోంది. గతేడాది సరిగ్గా ఇదే సమయంలో ఈ పంట టన్ను ధర రూ.8,386 మాత్రమే. మరోపక్క ఆయిల్‌పామ్‌ సాగు ప్రాధాన్యాన్ని గుర్తించిన రాష్ట్ర ఉద్యానశాఖ రాష్ట్రంలో భారీ ఎత్తున ఈ పంటను సాగుచేయించాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం సాధారణ వరి, పత్తి పంటలను కోటీ 10 లక్షల ఎకరాల్లో సాగుచేసినా రైతులకు పెద్దగా ఆదాయం రావడం లేదని, అదే ఆయిల్‌పామ్‌ సాగుచేస్తే రైతులకే కాకుండా ప్రభుత్వానికీ భారీగా ఆదాయం సమకూరుతుందని ఉద్యానశాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదించింది. మరోపక్క రాష్ట్ర ఆయిల్‌ఫెడ్‌తో పాటు మరో 14 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సొంత ఖర్చులతో నర్సరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టబోతున్నాయని వ్యవసాయ, ఉద్యానశాఖల ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ‘ఈనాడు- ఈటీవీ భారత్’కు చెప్పారు.

సాగు అవసరం ఎందుకంటే..

  • భారతదేశానికి 2.20 కోట్ల టన్నుల వంటనూనెలు ఏటా కావాలి. కానీ 70 లక్షల టన్నుల వంటనూనెల ఉత్పత్తికి సరిపడే నూనె గింజలే పండుతున్నాయి. దీంతో కోటిన్నర టన్నుల నూనెల దిగుమతికి రూ.70 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చిస్తున్నారు.
  • నువ్వులు, పొద్దుతిరుగుడు, వేరుసెనగలాంటి ఇతర నూనె గింజలకన్నా ఆయిల్‌ పామ్‌ దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఎకరానికి 10-12 టన్నుల గెలలు వస్తాయి. ఏడాదికి నికరంగా లక్ష రూపాయల ఆదాయం వస్తుంది.
  • మొదటి నాలుగేళ్లు ఒక్కో ఎకరానికి రూ.60 వేల వరకు ఖర్చు వస్తుంది.

నివేదికలో ముఖ్యాంశాలు...

  • రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేయాలి.
  • రాబోయే ఐదేళ్లలో రూ.4,800 కోట్ల రాయితీలివ్వాలి.
  • రైతులకు పంటసాగుకయ్యే ఖర్చులో 50 శాతం సొమ్మును రాయితీగా ఇవ్వాలి.
  • పొలానికి కచ్చితమైన సాగునీటి వసతి ఉంటేనే ఈ పంట సాగు సాధ్యం.
  • రాష్ట్రంలోని 25 జిల్లాలు సాగుకు అనువైనవి.
  • ఎకరా వరి సాగుకు అవసరమైన నీటితో 4 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేయవచ్చు.

ఇదీ చూడండి:రైతులకు పంట రుణం పుట్టట్లేదు!

ABOUT THE AUTHOR

...view details