IT Rides The House Of Two BRS MLAs In Hyderabad : అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కలిగిన రెండు సంస్థలు, వాటి అనుబంధ సంస్థలతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లల్లో రెండో రోజు కూడా ఆదాయపు పన్నుశాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలు కూడా రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని ఐటీ వర్గాలుస్పష్టం చేశాయి. ఈ సోదాలల్లో దాదాపు 70 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. ఐటీ సోదాలు ఎప్పటికి ముగుస్తాయో స్పష్టత లేకపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలు చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ నాయకులను బీజేపీ వేదింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్ కాలనీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లల్లో ఒక్కో ఇంట్లో రెండు నుంచి మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వైష్ణవి గ్రూపు స్థిరాస్తి సంస్థ పేరున, హోటల్ అట్ హోం పేరు నలుగురైదుగురు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యాపార లావాదేవీలకు చెందిన వివరాలకు, వీరు చెల్లిస్తున్న ఆదాయపు పన్నుకు వ్యత్యాసం ఉండడంతో రికార్డులు పరిశీలించాలని నిర్ణయించినట్లు ఐటీ అధికారులు తెలిపారు.