1 Lakh Scheme in Telangana for BC Communities : రాష్ట్రంలో బీసీలకు రూ.లక్ష సాయం దరఖాస్తు చేసుకోవడానికి.. రేపటితో గడువు ముగియనుండటంతో ఆశావహులు ఎమ్మార్వో కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేస్తున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో.. ఆన్‌లైన్ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఒక్కో అప్లికేషన్‌కు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతున్నట్లు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆశావహులు ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
1 Lakh Scheme in Telangana for BC Caste List :ఇదిలా ఉండగా.. ఇప్పటికే రూ.లక్ష ఆర్థిక సాయం పథకానికి దరఖాస్తుల సంఖ్య మూడు లక్షలు దాటింది. ధ్రువ పత్రాలను వెంటనే జారీ చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు మంత్రివర్గ ఉప సంఘం సూచించినా.. ఫలితం లేదని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యమైతే ఇబ్బందులు వస్తాయని గుర్తించిన మంత్రివర్గ ఉపసంఘం 2021 ఏప్రిల్ 1 నుంచి జారీ చేసిన పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెసులుబాటు కల్పించింది.
దరఖాస్తుల పేరిట దోపిడీ..:నిబంధనల ప్రకారం.. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసిన వారం రోజుల్లోగా ధ్రువీకరణ జారీ చేయాలని పైఅధికారులు సూచించినా.. సిబ్బంది లేరన్న సాకుతో మండల కార్యాలయాలు జాప్యం చేస్తున్నాయి. దీంతో అర్హత కలిగిన చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. మరోవైపు..మీ సేవ, ఆన్‌లైన్ కేంద్రాలు దరఖాస్తుదారుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. పత్రాలో కోసం స్మార్ట్ ఫోన్ నుంచి దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసినా.. చాలా మందికి సరైన అవగాహన లేక ఆన్‌లైన్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా.. దరఖాస్తు పూర్తి చేసేందుకు కేంద్రాల నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. మరికొందరు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వేగంగా ఇప్పిస్తామంటూ రూ.1000 వరకు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇబ్బందుల నేపథ్యంలో ఈ ఆర్థిక సహాయం దరఖాస్తు గడువును పొడిగించాలంటూ బీసీ కులవృత్తుల కుటుంబాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.