Telangana Secretariat Inauguration Postponed : తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రారంభోత్సవ తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈనెల 17న కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. సచివాలయ ప్రారంభోత్సవ అంశంపై సీఈసీని సీఎస్ శాంతికుమారి సంప్రదించారు. సీఈసీ నుంచి ఆశాజనక స్పందన రాకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Telangana : తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా
08:18 February 11
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా
Telangana New Secretariat Inauguration Postponed : తెలంగాణ సచివాలయం 28 ఎకరాల విస్తీర్ణంలో సుందరంగా సిద్ధమవుతోంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు కాగా.. 265 అడుగుల ఎత్తున నిర్మించారు. ప్రస్తుత ప్రాంగణంలోనే నూతన సచివాలయ భవన సముదాయ నిర్మాణాన్ని 2020 జనవరిలో ప్రభుత్వం చేపట్టింది. 11 అంతస్తుల ఎత్తుతో నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరం ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం సిద్ధమవుతోంది. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్ సదుపాయం కల్పించారు. సచివాలయ నిర్వహణ సిబ్బంది, స్టోర్స్ తదితరాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు. 7 నుంచి 11 అంతస్తుల ఎత్తులో డోములు నిర్మించారు. 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలను ఏర్పాటు చేశారు. ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన 4 సింహాల చిహ్నాలను ఏర్పాటు చేశారు.
భవనం లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా విశాలమైన కారిడార్లతో నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఆరు అంతస్తుల్లో సచివాలయ ప్రధాన భావనాన్ని నిర్మించారు. దీని విస్తీర్ణం 7.88 లక్షల చదరపు అడుగులు. మధ్యలో భవనం పైన ఐదు అంతస్తుల మేర భారీ గుమ్మటాలతో కూడిన సెంట్రల్ టవర్స్ నిర్మాణం అవుతోంది. అతిథుల కోసం నిర్మిస్తున్న ఈ పోర్టీకో టవర్స్‌ను.. ఆర్నమెంటల్ డోమ్స్, కార్వింగ్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోజు వేదపండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, బిహార్ సీఎం నీతీశ్‌కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్, డా.బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ తదితరులు హాజరవుతారని మంత్రి తెలిపారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత... సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. కానీ ఎన్నికల కోడ్ వల్ల ఇప్పుడు సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది.