రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2021-22)లో 189 ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 1,10,808 సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. గత ఏడాది ఆ సంఖ్య 1,11,143. అంటే ఈసారి 335 తగ్గాయి. ఏఐసీటీఈ ఆమోదించిన సీట్లలో 175 ప్రైవేట్ కళాశాలల్లో 1,05,419 ఉన్నాయి. గత ఏడాది సీట్లు 1,04,969. అంటే ప్రైవేట్ కళాశాలల్లో ఈసారి కొద్దిగా పెరిగాయి.
కొత్తగా రెండు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలను మంజూరు చేసినట్లు ఏఐసీటీఈ శుక్రవారం తన వెబ్‌సైట్లో పేర్కొంది. ఈ సంస్థ సీట్లకు ఆమోదం తెలిపినా ఏ కళాశాలకు ఎన్ని సీట్లు ఇవ్వాలో తుది నిర్ణయం తీసుకునేది జేఎన్‌టీయూహెచ్‌నే. ఆయా కళాశాలల్లోని వసతులు, బోధన సిబ్బంది తదితరాంశాలను పరిశీలించి వర్సిటీ తుది అనుమతి ఇస్తుంది. అలా అనుమతించిన సీట్లకే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.