హైదరాబాద్‌లో పలు బస్తీల జనాన్ని వరద కష్టాలు వెంటాడుతున్నాయి. చెరువులు పొంగి కాలనీల్లోకి చేరిన నీరు బయటికి వెళ్లే మార్గం లేక వారం నుంచి లోతట్టు ప్రాంతాలు నీటమునిగే ఉంటున్నాయి. వనస్థలిపురం పరిధిలోని హరిహరపురం కాలనీ వాసులు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నారు. ఇళ్ల మధ్య నిలిచిన నీటిని తక్షణం తోడేసి... పారిశుద్ధ్య పనులు చేపడితేనే తమ కుటుంబాలు క్షేమంగా ఉంటాయని స్థానికులు వేడుకుంటున్నారు.
బైక్‌ను విడిచి
హయత్ నగర్ పరిధిలోని మునగనూరు నుంచి తొర్రూర్ వెళ్లే దారిలో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతిలో ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా అందులో పడి కొంచెం దూరం కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని కాపాడారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వరద తాకిడికి వాహనంతో సహా కిందపడ్డారు. వెంటనే బైక్‌ను విడిచి తమ ప్రాణాలు రక్షించుకున్నారు. ఎగువన ఉన్న ఇంజాపూర్ బాతుల చెరువు నుంచి భారీగా వరద వస్తోంది.