రంజాన్ పవిత్ర మాసంలో భాగ్యనగరంలో ఎటుచూసినా కనిపించే హలీం బట్టీలు మాయమయ్యాయి. కోట్లాది రూపాయల వ్యాపారానికి గండిపడింది. వేలాది మంది ఉపాధి అవకాశం కోల్పోయారు. లాక్‌డౌన్ ఆంక్షలతో ఈ ఏడాది హలీం వంటకానికి విరామం ఇచ్చారు.
అదొక బ్రాండ్...
హలీం వంటకాన్ని వేకువజామునే తయారు చేయటం ప్రారంభిస్తారు. కోడి, పొట్టేలు, మేక, చేప, ఈము పక్షులు తదితరాల మాంసంతో తయారు చేస్తారు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకూ చార్మినార్ పరిసర ప్రాంతాలు హలీం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయేవి.
గ్రేటర్ పరిధిలో 7000 నుంచి 7,500 వరకూ హలీం బట్టీలు ఏర్పాటు చేస్తుంటారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, ఏపీ, తెలంగాణ, జమ్మూకశ్మీర్, పశ్చిమబంగా తదితర రాష్ట్రాల నుంచే కాకుండా.. పలు దేశాల నుంచి కూడా వంటగాళ్లు నగరానికి వచ్చేవారు. పేరున్న చెఫ్‌లకు రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకూ వేతనం ఇచ్చేవారు. విక్రయాల్లో కొంతమేర కమీషన్ బహుమతిగా అందజేసేవారు. సుమారు 40,000 మందికి రెండు, మూడు నెలల పాటు ఉపాధి దొరికేది.
కోట్లాది రూపాయల వ్యాపారం...
ఒకప్పుడు ఇరానీ హోటళ్లకే పరిమితమైన హైదరాబాద్ హలీం క్రమంగా అంతర్జాతీయంగా విస్తరించింది. ఈ-కామర్స్ అందుబాటులోకి రావటం వల్ల క్లిక్ చేస్తే చాలు వేడి వంటకాలు గుమ్మం ముందు చేరుతున్నాయి. అమెరికా, ఇంగ్లండ్, ఇరాన్, ఇరాక్, సౌదీ తదితర 60 దేశాలకు ఇక్కడ నుంచి ఈ రుచికరమైన వంటకాన్ని ఎగుమతి చేస్తుంటారు.
ఒక్క హైదరాబాద్‌లో రంజాన్ వేళ రోజూ రూ.2.5 కోట్ల హలీం విక్రయాలు జరుగుతాయని లెక్కలు చెబుతున్నాయి. వేలాది మందికి ఉపాధిని అందించే రుచుల విందుకు ఈ ఏడాది మాత్రం విరామం ఇచ్చామంటూ తయారీదారుల సంఘం అధ్యక్షుడు ఎం.ఎం.మజిద్ తెలిపారు.