Poaching TRS MLAs Case Accused into Custody: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంతో పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో మొయినాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన అ.ని.శా. కోర్టు ముగ్గురు నిందితులను కస్టడీకి అనుమతి ఇచ్చింది.
రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని... ఆ తర్వాత తిరిగి చంచల్‌గూడ జైలుకు పంపించాలని న్యాయస్థానం షరతు విధించింది. దీంతో పోలీసులు చంచల్‌గూడలో జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి స్వామీజీలను కస్టడీలోకి తీసుకొనున్నారు. ముగ్గురు నిందితులను ప్రశ్నించడం ద్వారా కేసులో పురోగతి సాధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కానీ కోర్టు నిందితులను రెండు రోజులపాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ముగ్గురు నిందితులు ఉన్నారు. నిందితులను పోలీసులు రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు. నాంపల్లిలోని అనిశా ప్రత్యేక కోర్టులో పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.